తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను దసరా నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. నాటి నుంచి రిజిస్ట్రేషన్లు ఆ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.  

దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌తో పాటు బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ధరణి పోర్టల్‌ వినియోగంపై ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్‌లకు శిక్షణ ఇస్తామని సీఎం తెలిపారు.

Also Read:కొత్త రెవెన్యూ చట్టం: ప్రజల ఆస్తుల రక్షణ కోసమేనన్న కేసీఆర్

ప్రతి సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నియామకం చేపడతామన్నారు. దసరా లోపే సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. డాక్యుమెంట్స్ రైటర్స్‌కు లైసెన్స్ ఇచ్చి శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దసరాలోపు ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్‌లో ఎంట్రీ చేయాలని కోరారు. 

అంతకుముందు ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం పేర్కోన్నారు. ప్రజల యొక్క దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు.