Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్... ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆ పేర్లే ఎందుకంటే

తెలంగాణలో బీడుబారిన భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక అద్భుతాలు ఆవిష్కృతం కాగా మరో అపూర్వ ఘట్టానికి రంగం సిద్దమైంది. 

Telangana CM KCR to inaugurate Kondapochamma Sagar Project
Author
Hyderabad, First Published May 27, 2020, 11:11 AM IST

హైదరాబాద్: ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కృతం కానున్నది. గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో పడతాయి. 15 టిఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయం సరిగా సాగకుండా ఎడారిగా మారిన కరువు ప్రాంతాలకు నీరు చేరుతుంది. 

అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండ పోచమ్మ దేవాలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంటుంది.  రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్ కు మల్లన్న సాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్ కు కొండ పోచమ్మ సాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. 

Telangana CM KCR to inaugurate Kondapochamma Sagar Project

కొండ పోచమ్మకు ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో భక్తులున్నారు. నిత్యం వచ్చి పూజలు చేస్తారు. తమను చల్లగా చూసే దేవతగా పేరుంది. కొండ పోచమ్మ సాగర్ కూడా ఈ ప్రాంత వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్ అమ్మవారి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును ఓ దేవాలయం మాదిరిగా భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. 

29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. 

Telangana CM KCR to inaugurate Kondapochamma Sagar Project

ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్ వద్ద గల  కొండ పోచమ్మ సాగర్ కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో పంపుహౌజు వద్దకు చేరుకునే చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌజ్ స్విచ్చాన్ (ప్రారంభం) చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం చినజీయ స్వామికి వీడ్కోలు పలుకుతారు. ఆహ్వానించిన కొద్ది మంది అతిథులకు అక్కడే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios