వారం రోజులు ఢిల్లీలోనే కేసీఆర్: బీఆర్ఎస్ విస్తరణపై చర్చలు
తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. రైతు సంఘాలు,పలు రంగాల ప్రముఖులు, రిటైర్డ్ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వారం రోజుల పాటు ఢిల్లీలో పలువురితో కేసీఆర్ భేటీ కానున్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందులలో భాగంగానే టీఆర్ఎస్ పేరును మార్చారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేసింది. ఈతీర్మానం కాపీని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈ నెల 6న ఈసీ అధికారులకు అందించింది.
టీఆర్ఎస్ పేరును మార్చిన తర్వాత కేసీఆర్ నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కు పార్టీ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ స్వంత భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు పూర్తి కావాలంటే ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో తాత్కాలిక భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం పరిశీలించారు. ఈ భవనంలో కొన్ని మార్పులు చేర్పులను కేసీఆర్ సూచించారు. వాస్తు ప్రకారంగా ఈ మార్పులను కేసీఆర్ సూచించారు.
ఇవాళ ఉదయం ఢిల్లీలోని వసంత్ విహర్ లో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు. ఇవాళ పలువురు పార్టీల నేతలు,మేథావులు, పలు రంగాల ప్రముఖులు, రిటైర్డ్ అధికారులతో కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలుకావాల్సిన అవసరం ఉందని రైతుసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గత మాసంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాల ప్రతినిధులు పర్యటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్నపథకాలను ప్రశంసించారు. ఇవాళ రైతుసంఘం నేత రాకేష్ టికాయత్ నేతృత్వంలో రైతు సంఘాల ప్రతినిధులు కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అవలంభించిన వ్యూహంపై కేసీఆర్ చర్చించనున్నారు.ఆయా రాష్ట్రాల్లో రాజకీ పరిస్థితులు,ప్రజల సమస్యలపై కేసీఆర్ చర్చించనున్నారు. 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలకంగా మారనుంది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాకటలో జేడీఎస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పోటీ చేయనుంది. ఈ విషయాన్ని కుమారస్వామి ప్రకటించారు. మరో వైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేను కేసీఆర్ గతంలో కలిశారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వైపు వెళ్లారు.
also read;భారతీయ రాష్ట్ర సమితి .. ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్
మహారాష్ట్ర నుండే దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలపై ఇప్పటికే రూపకల్పన చేశారు.ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సభకు ముందే ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీకి మద్దతును కూడగట్టేపనిలో కేసీఆర్ఉన్నారు.