కొందరి వల్లే పాలమూరు ఆలస్యం .. కృష్ణా జలాల్లో వాటా తేల్చండి, లేఖ రాయడానికి పదేళ్లా : మోడీపై కేసీఆర్ ఆగ్రహం
కొందరు నేతల వల్లే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీకి పౌరుషం వుంటే కృష్ణా ట్రిబ్యునల్‌లో వాటాలు తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో మనకు రావాల్సిన వాటాలను లెక్కగట్టి మూడు ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామన్నారు సీఎం కేసీఆర్. శనివారం కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. మూడు ప్రాజెక్ట్‌లు పూర్తయితే దేశానికే తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వెళ్తుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఇవాళ సుదినమన్నారు కేసీఆర్. ఒకప్పుడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్‌లో అడ్డా కూలీ అన్నారు . ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పాలమూరు ప్రాజెక్ట్‌ను గత పాలకులు, నాయకులు చాలా మంది అడ్డుకున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు చేయని దద్దమ్మ నాయకులే ఇన్నాళ్లూ అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. గత పాలకులు పాలమూరు జిల్లా నీటి వాటా గురించి ఎప్పుడూ అడగలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో తన తొలిపాదయాత్ర జోగులాంబ గద్వాల నుంచే చేశానని ఆయన గుర్తుచేశారు. ఇవాళ తెలంగాణ ప్రజలే ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారని .. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు నేతల వల్లే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైందని ఆయన దుయ్యబట్టారు. గత పాలకులు పాలమూరు జిల్లా నీటి వాటా గురించి ఎప్పుడూ అడగలేదని కేసీఆర్ మండిపడ్డారు.
ఇంటిదొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు. మనం ఎత్తులో వున్నాం నీళ్లు రావని.. ఈ జిల్లా నేతలే మాట్లాడారని సీఎం దుయ్యబట్టారు. మన నీళ్లు ఏపీకి తరలివెళ్తుంటే ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారని కేసీఆర్ చురకలంటించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీకి చేతకావటం లేదని సీఎం దుయ్యబట్టారు. విశ్వగురు అని చెప్పుకునే మోడీ 9 ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదన్నారు. పదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలని సీఎం డిమాండ్ చేశారు. దత్తత తీసుకున్న సీఎంలు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదని కేసీఆర్ చురకలంటించారు.
కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖ రాసేందుకు పదేళ్ల సమయం సరిపోదా అని సీఎం నిలదీశారు. బీజేపీకి పౌరుషం వుంటే కృష్ణా ట్రిబ్యునల్‌లో వాటాలు తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పాలమూరుకు నీళ్లు అడిగితే కేంద్రం ఏం చేసిందని సీఎం ప్రశ్నించారు. చేతనైతే బీజేపీ నేతలు మోడీ వద్దకు వెళ్లి నీటి వాటా అడగాలని కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పడగానే మొట్టమొదట విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టి అధిగమించామని సీఎం గుర్తుచేశారు. పింఛన్లు కూడా క్రమంగా పెంచుకుంటూ పోతున్నామని.. ఉన్న తెలంగాణను పోగొట్టింది, కాంగ్రెస్ నేతలు కాదా అని కేసీఆర్ నిలదీశారు. 60 ఏళ్లలో మహబూబ్‌నగర్ జిల్లాకు వైద్య కళాశాల వచ్చిందా అని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ సీఎంలు జిల్లాకొక వైద్య కళాశాల తెచ్చారని కేసీఆర్ వెల్లడించారు.
తమిళనాడు పాఠశాలల్లో విద్యార్ధులకు అల్పాహారం పెడుతున్నారని.. పథకం బాగుందని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పదో తరగతి వరకు అమలు చేయాలని నిర్ణయించామని కేసీఆర్ చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు తొలిసారి ఎంతో సంతోషపడ్డానని సీఎం తెలిపారు. మళ్లీ ఇవాళ పాలమూరు గడ్డపై కృష్ణా జలాలు పారుతుంటే అంత సంతోషం కలిగిందని కేసీఆర్ చెప్పారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. కొల్లాపూర్‌కు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.