ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీబీసీ డాక్యుమెంటరీపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేస్తే.. బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలా అని కేసీఆర్ నిలదీశారు. ఈడీకి, బోడికి భయపడటానికి బీబీసీ .. జీ న్యూస్ కాదని ఆయన చురకలంటించారు.  

గోద్రా అల్లర్లపై డాక్యుమెంట్ చేస్తే బీబీసీని బ్యాన్ చేయాలా అని సీఎం ప్రశ్నించారు. కొంచెం మంచి పనులు చేయాలని మోడీకి చెప్పాలని.. బీబీసీని బ్యాన్ చేయాలని బీజేపీకి చెందిన లాయర్ సుప్రీంకోర్ట్‌లో కేసు వేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీసీ అంటే జీ న్యూసా ఈడీ దాడులు చేయగానే బంద్ చేయడానికి అంటూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీబీసీ.. ఈడీ, బోడీకి భయపడుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో రూమ్ రెడీ చేశాం అంటారా అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 తర్వాత బీజేపీ ఖేల్ ఖతమని ఆయన జోస్యం చెప్పారు. 

బంగ్లాదేశ్ వార్ తర్వాత ఇందిరా గాంధీని వాజ్‌పేయి కాళికా అన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. అలహాబాద్ కోర్ట్ తీర్పుతో ఇందిరా గాంధీ ప్రభుత్వం కూలిపోయిందని సీఎం తెలిపారు. తర్వాత వచ్చిన జనతా పార్టీ కొన్ని తప్పులు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. జనతా పార్టీ తప్పులతో జనం మళ్లీ ఇందిరా గాంధీకే పట్టం కట్టారని ఆయన అన్నారు. అప్పులు చేయడంలో మోడీని మించిన ఘనుడు లేడని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేస్తున్నారని.. నష్టం వస్తే ప్రజలపై భారం, ప్రాఫిట్ వస్తే ప్రైవేట్ వాళ్లకు ఇస్తారా అని సీఎం ప్రశ్నించారు. ఎల్ఐసీని అమ్మాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ఎయిరిండియాను మళ్లీ టాటాకి అప్పగించారని సీఎం చురకలంటించారు. మోడీ హయాంలో ఎక్కడైనా వృద్ధి రేటు వుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

ALso REad: రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు: అసెంబ్లీలో కేసీఆర్

అదానీ రూపంలో దేశానికి ఉపద్రవం వచ్చిందని.. ఇంత గొడవ జరుగుతున్నా అదానీ గురించి ప్రధాని మాట్లాడలేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ ఆస్తి కరిగిపోయిందని.. ఆయన సంస్థలు ఉంటాయో, పోతాయోనని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చాడని.. అదృష్టం బాగుండి మన దగ్గర అదానీ కంపెనీ రాలేదన్నారు. అదానీ గురించి మోడీ సమాధానం చెప్పకుండా జబ్బ కొట్టుకున్నారని.. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయం ఏంటని ఆయన ప్రశ్నించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే.. నువ్వెన్ని అంటూ మోడీ, రాహుల్ గొడవపడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

దేశం పరిస్ధితి క్రిటికల్‌గా వుంటే మోడీ మాట్లాడరని.. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం వుండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువని సీఎం తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అన్నారు. మనదేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని.. మొత్తతం 192 దేశాల్లో మనదేశం ర్యాంక్ 139 అని కేసీఆర్ తెలిపారు. మోడీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగా ఇవ్వాలని సీఎం చురకలంటించారు. భారతదేశ విషయాలు హిండెన్ బర్గ్ బయటపెట్టిందని.. ఇంత జరుగుతున్నా అదానీపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడని ఆయన దుయ్యబట్టారు. దీనిపై పార్లమెంట్‌లో బీఆర్ఎస్,కాంగ్రెస్ కొట్లాడాయని కేసీఆర్ గుర్తుచేశారు.