Asianet News TeluguAsianet News Telugu

దళితబంధులో చేతివాటం.. ఎవరెంత తీసుకున్నారో చిట్టా వుంది , ఇదే లాస్ట్ వార్నింగ్ : ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్

దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

telangana cm kcr serious on brs mlas for taking money from Dalit Bandhu beneficiaries ksp
Author
First Published Apr 27, 2023, 5:12 PM IST

దళిత బంధు కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది తన చివరి వార్నింగ్ అని.. మళ్లీ వసూళ్లకు పాల్పడితే టికెట్ దక్కదని, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీ అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యతని ఆయన హెచ్చరించారు. 

అంతకుముందు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని.. కేడర్‌తో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ముఖ్యమని కేసీఆర్ అన్నారు. 

ALso Read: బీఆర్ఎస్ కోసం టీవీ ఛానెల్ : సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు

అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానెల్‌ను కూడా నడపవచ్చని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీలను ఇన్‌ఛార్జీలుగా నియమిస్తామన్నారు. మూడు, నాలుగు నెలల్లో ఇన్‌ఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్న ఆయన.. గత ఎన్నికల్లో కంటే ఎన్ని ఎక్కువ సీట్లు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని.. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బందని, తాను చేసేదేం లేదని కేసీఆర్ హెచ్చరించారు. 

గురువారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 250కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios