Asianet News TeluguAsianet News Telugu

రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మిత్రుడు కాబట్టే నో ఎంక్వైరీ : అదానీ షేర్ల పతనంపై కేసీఆర్ వ్యాఖ్యలు

అదానీ వల్ల జనం సొమ్ము రూ.10 లక్షల కోట్లు ఆవిరైందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అదానీ మిత్రుడు కాబట్టే అతణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

telangana cm kcr sensational comments on adani shares fall
Author
First Published Feb 5, 2023, 7:08 PM IST

ఇటీవల హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతో , స్టాక్ మార్కెట్లు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ ఎఫెక్ట్‌తో జనం సొమ్ము రూ.10 లక్షల కోట్లు ఆవిరైందని.. అదానీ మిత్రుడు కాబట్టే అతణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అంత వేగంగా అదానీ ఎదుగుదల ఎలా సాధ్యమైంది.. సాధారణ వ్యాపారికి ఇది ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ నుంచి రూ.87 వేల కోట్లు పెట్టించారని సీఎం మండిపడ్డారు. 

బొగ్గు గనులున్న అన్ని ప్రాంతాలకు రైల్వే లైన్లు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం జబర్దస్తీ ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి రంగానికి 24 గంటలూ కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. అదానీకి ప్రయోజనం కలిగించడానికి విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. దేశంలో 50 శాతం మంది మహిళలు వున్నారని.. అయినా వాళ్లకు సరైన ప్రాతినిథ్యం లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలన్నారు. 

ALso REad: ఆ సంస్ధల్ని మళ్లీ జాతీయం చేస్తాం : నాందేడ్‌లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అన్ని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బేటీ పడావో, బేటీ బచావో అంటారు కానీ.. ఉత్తర భారతంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని ఆయన దుయ్యబట్టారు. దేశంలో ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు లక్షల కోట్ల ఆస్తులున్నాయన్నారు. మేకిన్ ఇండియా అన్నారు కానీ దానికి అవసరమైన కనీస ఏర్పాట్లు చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు. సంకల్పం వుంటే ఏదైనా ఆచరణ సాధ్యమేనన్నారు. మేకిన్ ఇండియా సరైందే అయితే దేశానికి ఎందుకీ దుస్థితి అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన నిలదీశారు. అదానీ అక్రమాలపై జేపీసీ విచారణకు కేంద్రం ఎందుకు అంగీకరించడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. 

కేంద్రం పెద్ద దోస్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని.. ఎల్ఐసీ చేత అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి, దాన్ని కూడా దివాళా తీయిస్తారని కేసీఆర్ జోస్యం చెప్పారు. అనేక కంపెనీలు దేశానికి రావడానికి సిద్ధంగా వున్నా.. కేంద్రం వైఖరి అనుకూలంగా లేదన్నారు.  మేధావులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు , శాస్త్రవేత్తలతో కలిసి బీఆర్ఎస్ పాలసీ డ్రాఫ్ట్ తయారు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. విద్యుత్‌ని ప్రైవేట్‌వాళ్లకు అప్పగిస్తే ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తారని సీఎం తెలిపారు. ఎన్ఆర్సీ, ట్రిపుల్ తలాక్ వంటి చట్టాలను కరాఖండీగా వ్యతిరేకించామని కేసీఆర్ గుర్తుచేశారు. ఎల్ఐసీకి నష్టం జరగలేదని కేంద్రం ఎలా చెబుతుందని ఆయన ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios