Asianet News TeluguAsianet News Telugu

ఆ సంస్ధల్ని మళ్లీ జాతీయం చేస్తాం : నాందేడ్‌లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కేంద్రం ప్రైవేటీకరించిన విద్యుత్ సంస్థలను తాము జాతీయం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దేశంలో 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే వుంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు
 

telangana cm kcr slams modi govt over privatization
Author
First Published Feb 5, 2023, 6:49 PM IST

దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న దేశాలైన సింగపూర్, జపాన్, మలేషియా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నీళ్ల విషయంలో తాను చెప్పింది సొంత లెక్కలు కావని, కేంద్ర జలశక్తి శాఖ చెప్పినదేనని కేసీఆర్ పేర్కొన్నారు. నీళ్లు లేక జరుగుతున్న కొట్లాట కాదని, దేవుడు మనకు సరిపడా నీళ్లు ఇచ్చాడని సీఎం అన్నారు. ఇంత పెద్ద మనదేశంలో ఒక్కటంటే ఒక్క పెద్ద రిజర్వాయర్ లేదని.. ట్రిబ్యునళ్ల పేరుతో దశాబ్ధాల తరబడి నీటి వాటాలను నాన్చుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశంలో నీటి వనరులకు కొదవలేదని, అవసరానికి మించి నీళ్లున్నాయని చెప్పారు. కృష్ణా నీటిపై బ్రిజేష్ ట్రిబ్యునల్ 20 ఏళ్లయినా ఒక్క తీర్పు ఇవ్వలేదని.. నీటి కొట్లాటపై మేథావులు ప్రజలకు అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించారు. దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాలన్న ఆయన.. వాటర్ పాలసీని మార్చడానికి ఎవరినీ ప్రాధేయపడాల్సిన అక్కర్లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ నీటికి కటకటలాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అతి చిన్న దేశమైన జింబాబ్వేలో వుందన్నారు. నీటి వినియోగంపై బీఆర్ఎస్ ఎజెండా విప్లవాత్మకంగా వుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

Also REad: కేసీఆర్ నేషనల్ గేమ్.. తెలంగాణ వెలుపల తొలి అడుగు అక్కడే.. స్ఫష్టతనిచ్చేసిన బీఆర్ఎస్ అధినేత..!!

వ్యవసాయానికి కొన్ని రాష్ట్రాల్లో పగటిపూట కరెంట్ ఇస్తుండగా.. కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట విద్యుత్ ఇస్తున్నారని సీఎం అన్నారు. ఏమైనా అంటే దేశం కోసం ధర్మం కోసమని గగ్గోలు పెడతారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో అవసరాలన్నీ తీరాక 20 వేల టీఎంసీల నీళ్లు మిగులుతాయని కేసీఆర్ చెప్పారు. దేశంలో రోడ్లు, షిప్‌ యార్డులు, ఎయిర్‌పోర్టులు.. ఏవీ సరిగా లేవని ఆయన ఫైర్ అయ్యారు. భారత్‌లో హైవేపై ట్రక్ స్పీడ్ గంటకు 50 కి.మీలు మాత్రమేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. మనదేశంలో గూడ్స్ రైలు సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లేనని.. చైనాలో గంటకు 120 కిలోమీటర్లని సీఎం చెప్పారు. దేశంలో వాటర్ పాలసీ, విద్యుత్ పాలసీ, ఇరిగేషన్ పాలసీని మార్చాల్సిన అవసరం వుందని కేసీఆర్ అన్నారు. 

దేశంలో కనీసం నాలుగు భారీ సాగునీటి ప్రాజెక్ట్‌లు కట్టాల్సిన అవసరం వుందని సీఎం అన్నారు. వున్న బొగ్గుతో మరో 125 ఏళ్లు వరకు కరెంట్ ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పారు. నష్టాలు ప్రజలపై మోపుతూ లాభాలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని సీఎం దుయ్యబట్టారు. కేంద్రం ప్రైవేటీకరించిన విద్యుత్ సంస్థలను తాము జాతీయం చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఎయిరిండియాని టాటా నుంచి జాతీయం చేసి.. మళ్లీ టాటాకే అప్పగించారని సీఎం ఎద్దేవా చేశారు. దేశంలో 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ పరిధిలోనే వుంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండేళ్లలోనే దేశంలో నిరంతర వెలుగులు నింపుతామని సీఎం తెలిపారు. రైల్వే లైన్ల కోసం కోల్ ఇండియా నిధులు ఇచ్చినా.. కేంద్రం వేయలేదని ఆయన దుయ్యబట్టారు. న్యూయార్క్‌లో కరెంట్ పోయినా హైదరాబాద్‌లో పోదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios