ఇకపై ప్రతి యేటా అంబేద్కర్ పేరిట ప్రత్యేక పురస్కారాన్ని అందజేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇందుకోసం రూ.50 కోట్ల డిపాజిట్ చేస్తామని, దీని వల్ల ఏడాదికి రూ.3 కోట్ల వరకు వడ్డీ వస్తుందని కేసీఆర్ చెప్పారు.
ఇకపై ప్రతి యేటా అంబేద్కర్ పేరిట ప్రత్యేక పురస్కారాన్ని అందజేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి ప్రతియేటా అంబేద్కర్ జయంతి రోజున పురస్కారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.50 కోట్ల డిపాజిట్ చేస్తామని, దీని వల్ల ఏడాదికి రూ.3 కోట్ల వరకు వడ్డీ వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఈ నిధి శాశ్వతంగా వుండేలా ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
అంబేద్కర్ విశ్వమానవులని.. అణగారిన వర్గాలకు ఆశాదీపమని కేసీఆర్ ప్రకటించారు. 70 ఏళ్లు దాటినా రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు అమలు కావడం లేదన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటూ పోవడం కాదని, ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను ఎవరో చెబితే అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని.. సందేశం ఇవ్వడానికే పెట్టానని సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటి సెక్రటేరియట్ వుందని దీనికి కూడా అంబేద్కర్ పేరే పెట్టామని కేసీఆర్ వెల్లడించారు.
దీని పక్కనే అమరవీరుల స్మారకం, దానిని ఆనుకోని హుస్సేన్ సాగర్.. అందులో అంబేద్కర్ పూజించే బుద్ధుడి విగ్రహం వుందని సీఎం పేర్కొన్నారు. ప్రతి రోజే సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని చూసి స్పూర్తిని పొందాలని కేసీఆర్ తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసేందుకు మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రయత్నాలు ప్రారంభించారని, దీనిని కొప్పుల ఈశ్వర్ కొనసాగించారని సీఎం వెల్లడించారు. ఇందుకోసం ఈశ్వర్ పలు దేశాల్లో అధ్యయనం చేశారని.. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వయంగా ఇంజనీర్ కావడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారని కేసీఆర్ ప్రశంసించారు.
Also Read: వాజ్‌పేయ్ లాంటి నేతలు లేరు, రాష్ట్ర నేతలే ఎదగాలి: ప్రకాష్ అంబేద్కర్
స్వాతంత్ర్యం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేదలంటే దళితులేనని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితుల అభ్యున్నతి కోసం లక్షా 25 వేల కోట్లు కేటాయించామని సీఎం పేర్కొన్నారు. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లి.. తెలంగాణ బిల్లు పాసయ్యాకే వస్తానని చెప్పానని అలాగే చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దేశంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. తాను మహారాష్ట్రకు వెళితే అక్కడి సమాజం నుంచి ఊహించని స్పందన వచ్చిందని సీఎం అన్నారు.
అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇలా ఎక్కడికెళ్లినా మనకు మంచి స్పందన వస్తుందని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణలో అమలవుతున్న దళిత బంధుని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు. దేశంలోని పాతిక లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధుని అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై వుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 50 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు అందిందని, ఈ ఆర్ధిక సంవత్సరంలో లక్షా పాతిక వేల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
