మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తి నీటి నిల్వలు ఉన్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం ఆయన మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం కరీంనగర్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... శాశ్వతంగా కరీంనగర్ జిల్లాలో కరువు సమస్య తీరిపోయినట్లేనని సీఎం తెలిపారు.

వర్షాలు పడినా పడకపోయినా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు వర్షాలు పడకపోయినా రెండు పంటలు పండించుకోవచ్చని కేసీఆర్ వెల్లడించారు. గతంలో ఈ ప్రాంతంలో వివక్షకు గురయ్యానని.. కరువు సంభవించడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు వలసలు వెళ్లారని, కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  

Also Read:KCR Video : ఈటెలను బస్సులో ఎక్కించుకున్న కేసీఆర్

ఆత్మహత్యలు పరిష్కారం కాదని గతంలో గోడలపై జిల్లా కలెక్టర్ రాయించాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో 140 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా ఉంటుందని.. మిడ్ మానేరు లింక్ విజయవంతంగా పూర్తయ్యిందని కేసీఆర్ తెలిపారు.

ప్రాణహిత నుంచి ఏడాదంతా నీరు వస్తుందని.. 90 టీఎంసీలు గరిష్టంగా వాడుకోవచ్చని, ప్రాజెక్టుల కారణంగా మిడ్‌మానేరులో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం మిడ్ మానేరు లింక్ విజయవంతంగా పూర్తయ్యిందని సీఎం తెలిపారు.

Also Read:తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?: రేసులో వీరే...

ఉద్యమకారుడిగా రాష్ట్రాభివృద్ధిపై నిబద్ధత కలిగి వున్నామని..ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురయ్యామని.. ఇప్పుడు తెలంగాణ పోరాట ఫలితాలు సఫలమవుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎక్స్‌రే కళ్లతో ఇరిగేషన్ విభాగాన్ని చూశామని.. రాష్ట్రంలోని 1,230 చెక్‌డ్యామ్‌లకు అనుమతులిస్తే సింహభాగం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకే కేటాయించామని కేసీఆర్ అన్నారు. 

కరవు జిల్లాగా పేరున్న కరీంనగర్ ఇకపై పాలుగారే జిల్లాగా మారుతుందని.. వచ్చే జూన్ నాటికి చెక్ డ్యాములన్నీ నిండేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్‌లదే కీలకపాత్రని.. తాను కలలుగన్న తెలంగాణ ఆవిష్కారం అవుతోందని కేసీఆర్ ఉద్వేగంగా చెప్పారు.