హైదరాబాద్:తెలంగాణ సీఎస్ రేసులో 14 మంది ఉన్నారు. ఈ రేసులో సోమేష్ కుమార్  పేరు ప్రధానంగా విన్పిస్తోంది. ఎస్ కే జోషీ ఈ నెల 31వ తేదీతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. జోషీని మరో ఆరుమాసాల పాటు టర్మ్‌ను కొనసాగించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేదు. దీంతో సోమేష్ కుమార్ ను తదుపరి సీఎంగా నియమించే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషీ ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో రిటైర్ కానున్నారు. దీంతో కొత్త  సీఎస్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తును ప్రారంభించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ఉదయం సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సాయంత్రం ఆయన హైద్రాబాద్‌కు తిరిగి రానున్నారు.

ఇవాళ రాత్రికి కొత్త సీఎస్‌ ఎంపికపై కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. తెలంగాణ సీఎస్‌గా సోమేష్ కుమార్ ను కేసీఆర్ ఎంపిక చేసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కాలంలో సోమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సోమేష్ కుమార్ చర్యలు తీసుకొన్నారనే ప్రచారం సాగింది.

సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా పేరు కూడ సీఎస్ రేసులో విన్పిస్తోంది. అజయ్ మిశ్రాకు కొంత కాలం అవకాశమిచ్చి ఆ తర్వాత సోమేష్ కుమార్ కు సీఎస్ గా బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అజయ్ మిశ్రా కాకుండా నేరుగా సోమేష్ కుమార్ ను కూడ తీసుకొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

తెలంగాణ సీఎస్ పదవికి 14 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీలు పోటీ పడుతున్నారు. బీపీ ఆచార్య, బినయ్ కుమార్, అజయ్ మిశ్రా, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, సోమేష్ కుమార్, శాంతికుమారి, షాలినీ మిశ్రా, అధర్ సిన్హా, వసుధా మిశ్రాలు పోటీలో ఉన్నారు.

ప్రధానంగా అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ ల పేర్లు సీఎస్ పదవి కోసం విన్పిస్తున్నాయి. సోమేష్ కుమార్ గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో పనిచేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్  విశ్వాసంలో తీసుకొన్న ఐఎఎస్ అధికారుల్లో  సోమేష్ కుమార్ పేరు ప్రధానంగా విన్పిస్తోంది.దీంతో సోమేష్ కుమార్ కు  సీఎస్ గా కేసీఆర్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం నాడు ఉదయానికి కొత్త సీఎస్ గా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.  

ప్రస్తుత సీఎస్ ఎస్ కే జోషీకి  మాత్రం మరో ఆరు మాసాల పాటు కొనసాగించే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. దీంతో సోమేష్ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.