నూతనంగా నిర్మించే సచివాలయాన్ని 10 నెలల సమయంలోనే పూర్తి చేయాలనీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇకపై యుద్ధప్రాతిపదికన సమీకృత కొత్త సచివాలయం పనులు జరగనున్నాయి. 

20 రోజుల్లో కూల్చివేత పనులు, శిథిలాల తరలింపు పనులను పూర్తిచేయనున్నట్టు తెలియవస్తుంది. శ్రావణంలోనే కొత్త నిర్మాణం ప్రారంభించాలని యోచిస్తున్నారు. స్థానిక వనరులతోనే కొత్త భవన నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 

నక్ష, నమూనా, కొత్త భవన సముదాయంలో సౌకర్యాలు, ఛాంబర్లు, ఫ్లోర్లు, ల్యాండ్ స్కేప్ లు, పార్కింగ్, గుడి, బడి, మసీదు, బ్యాంకు ఇతర స్పెసిఫికేషన్స్ పై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, అధికారులు ఇప్పటికే దాదాపుగా కసరత్తులు పూర్తిచేసినట్టు సమాచారం. 

త్వరలో టెండర్లు పిలవాలని అధికారులను ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీనితో అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు.  ఇవాళ ఆర్థికశాఖకు సమీకృత కొత్త సచివాలయం ప్రతిపాదనలు పంపనున్నట్టుగా సమాచారం. 

ఇకపోతే.... తెలంగాణ సచివాలయం  భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం నాడు ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సచివాలయ భవనాలనకు కూల్చివేతలకు ఈ ఏడాది జూన్ 29వ తేదీన హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ నెల 10వ తేదీన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చిక్కుడు ప్రభాకర్ లు కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా సచివాలయం భవనాలను కూల్చివేస్తున్నారని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు పర్యావరణానికి కూడ ఈ భవనాల కూల్చివేతతో హాని కలుగుతోందని పేర్కొన్నారు. దీంతో ఇవాళ్టివరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేస్తూ హైకోర్టు స్టేను ఇచ్చింది. 

also read:సచివాలయం కూల్చివేత: సుప్రీంలో కేసీఆర్ కు ఊరట, జీవన్ రెడ్డికి చుక్కెదురు

సచివాలయం కూల్చివేత పనుల విషయంలో  పర్యావరణ అనుమతులు తీసుకోవాలో వద్దో చెప్పాలని హైకోర్టు నిన్న కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ నోటీసులపై పర్యావరణ అనుమతులు అవసరం లేదని సొలిసిటర్ జనరల్ ఇవాళ హైకోర్టుకు స్పష్టం చేశారు.

సచివాలయం భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. సచివాలయం కూల్చివేత విషయంలో కేబినెట్ తీసుకొన్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. 

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.సచివాలయం కూల్చివేతల అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లను శుక్రవారంనాడు హైకోర్టు కొట్టివేసింది.

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు గత నెల 29వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళే  కొట్టివేసింది. ఆరు రోజుల క్రితం జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ చేసింది.జీవన్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసింది.