ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ రోజే సీఎస్‌కు పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వనుంది. జనవరి చివరిలోగా అన్ని ప్రమోషన్లు పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

అటు ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని వెంటనే తీసుకొస్తామని తెలిపారు. జనవరిలోనే పీఆర్సీ, పదవి విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు.

అలాగే జనవరి మొదటి వారంలోనే టీచర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. అంతకు ముందు వేతన సవరణ, ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు, సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపై వారితో చర్చించారు కేసీఆర్.

ఫిట్‌మెంట్‌పై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. టీజీవో, టీఎన్జీవో, ట్రెస్సాతో పాటు నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ హాజరయ్యారు. వీరితో కలిసి కేసీఆర్ భోజనం చేశారు.

ఫిట్‌మెంట్‌తో పాటు సర్వీస్ నిబంధనలపై చర్చించేందుకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని వేశారు. అయితే ఈ కమిటీ సమావేశాలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా వుండటంతో నేరుగా, సీఎం రంగంలోకి దిగారు.