బీహర్ కి బయలు దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్: జాతీయ రాజకీయాలపై నితీష్ తో చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు బీహార్ రాష్ట్రానికి బయలుదేరారు. జాతీయ రాజకీయాలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కేసీఆర్ చర్చించనున్నారు. గల్వాన్ లో మరణించిన జవాన్లకు పరిహారం అందించనున్నారు కేసీఆర్.
హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు బీహార్ కు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బీహార్ టూర్ కు వెళ్లారు. గల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో మరణించిన అమర జవాన్లకు కేసీఆర్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ బోయిగూడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కార్మికులకు కూడా కేసీఆర్ పరిహారం అందించనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో లంచ్ భేటీలో కేసీఆర్ పాల్గొంటారు. జాతీయ రాజకీయాలపై నితీష్ కుమార్ తో కేసీఆర్ చర్చించనున్నారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇటీవలనే ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నియమించారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత నితీష్ కుమార్ తో భేటీకి కేసీఆర్ వెళ్తున్నారు. బీహర్ సీఎం నితీష్ కుమార్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ తరుణంలో ఇవాళ వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ కొంత కాలంగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే దేశం ఆర్ధికంగా చతికిల పడిపోతుందని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ విమర్శ:లపై బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు గాను ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెసేతర పార్టీల నేతలు, సీఎంలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. 2018 లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై ఆయన పలు పార్టీలతో చర్చించారు. అయితే ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ అంశం పక్కన పడిపోయింది.
also read:నేడు నితీష్‌తో భేటీ కానున్న కేసీఆర్.. కొత్త కామెడీ షో అంటూ బీజేపీ సెటైర్..
ఈ ఏడాదిలో కూడ పలు పార్టీల నేతలతో పాటు సీఎంలతో కూడా కేసీఆర్ చర్చించారు. దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం తాను ప్రయత్నిస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు గాను కేసీఆర్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కేసీఆర్.అయితే తెలంగాణలో నే టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావిస్తుంది.దీన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను బీజేపీ ప్లాన్ చేసింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు గాను సునీల్ బన్సల్ ను బీజేపీ ఇంచార్జీగా నియమించింది.