Asianet News TeluguAsianet News Telugu

నేడు నితీష్‌తో భేటీ కానున్న కేసీఆర్.. కొత్త కామెడీ షో అంటూ బీజేపీ సెటైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బిహార్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలవనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా విపక్షాలు ఉమ్మడిగా ఎలా పోరాడాలనేది ప్రధాన అంశంగా ఈ భేటీ జరగనుంది. అయితే వీరిద్దరు భేటీ కావడంపై స్పందించిన బీజేపీ కొత్త కామెడీ షో అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

KCR to meet Nitish Kumar in Patna BJP calls it NEW COMEDY show
Author
First Published Aug 31, 2022, 10:51 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బిహార్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలవనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా విపక్షాలు ఉమ్మడిగా ఎలా పోరాడాలనేది ప్రధాన అంశంగా ఈ భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించేందుకు శక్తివంతమైన కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఇందుకోసం కేసీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరనున్నారు. పాట్నాలో నితీష్ కుమార్‌తో కలిసి కేసీఆర్.. గల్వాన్‌ లోయలో మరణించిన బిహార్‌కు చెందిన ఐదుగురు సైనికుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. అలాగే కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్‌ బోయగూడ టింబర్‌ డిపోలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మరణించిన బిహార్‌కు చెందిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

ఆ తర్వాత నితీష్ కుమార్‌తో కేసీఆర్ లంచ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఎన్‌డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వ్యతిరేక శిబిరంలో ఆయన పాత్ర కీలకమనే కథనాలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదికగా కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్, నితీష్‌ల బేటీపై స్పందించిన జేడీయూ ఎమ్మెల్సీ, ముఖ్య అధికార ప్రతినిధి నీరజ్ కుమార్.. ‘‘ఇది బీజేపీని ఓడించడానికి దక్షిణాది, ఉత్తరాది మధ్య ఐక్యత అవుతుంది’’అన్నారు. ‘‘కేసీఆర్ నిస్సందేహంగా దక్షిణాదికి చెందిన ప్రముఖ నాయకుడు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. నితీష్ కుమార్‌లో విపక్షాలు కొత్త ఆశలు చూస్తున్నాయి. ఇద్దరు నేతల భేటీ జాతీయ పరిణామాలను కలిగి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 

ఆర్జేడీ జాతీయ ఉపాధ్యాక్షుడు శివానంద్ తివారీ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్, నితీష్‌ల భేటీ కచ్చితంగా ముఖ్యమైనదే. విపక్షాల ఐక్యత నెలకొల్పడంలో ఇరువురు నేతలది చాలా కీలక పాత్ర. ఎన్డీయే నుంచి నితీష్ బయటకు రావడం ఇటీవలి కాలంలో బీజేపీకి అతిపెద్ద ఎదురుదెబ్బ’’ అని ఆయన అన్నారు.

ఇక, బీహార్‌లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నితీష్ కుమార్ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాల నుంచి ధీటైన అభ్యర్థి నితీష్ కుమార్‌ అనే వాదనలు తాజాగా తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన నితీష్ కుమార్.. తాను ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి పదవిపై ఆకాంక్షలేవీ లేవని అన్నారు. అయితే జేడీయూ నాయకులు కామెంట్స్ మాత్రం మరోలా ఉన్నాయి. 

Also Read: హుబ్లీ ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి.. అర్దరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

2024 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్‌ కుమార్‌, నరేంద్ర మోదీ మధ్యే పోటీ ఉంటుందని.. ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు నితీష్ కుమార్‌ పేరును అంగీకరిస్తాయని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్‌ యాదవ్‌ అన్నారు.ఆర్జేడీకి  చెందిన మరో అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘2024లో దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుండగా.. నితీష్ కుమార్ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని అన్నారు. అయితే నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల వైపు వెళితే.. రెండోసారి రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తమ నాయకుడు తేజస్వీ యాదవ్ సీఎం స్థానం దక్కుతుందనే భావనలో ఆర్జేడీ యువ నాయకులు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇక, నితీష్ కుమార్, కేసీఆర్‌ భేటీపై బీజేపీ స్పందించింది.  విపక్షాల ఐక్యత పేరుతో కేసీఆర్, నితీష్ కుమార్‌ల మధ్య జరిగే సమావేశం ‘‘కొత్త కామెడీ షో’’ అని బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షులు లాలూ ప్రసాద్.. ఇద్దరూ అవినీతి, కుటుంబ పాలనను ప్రవృత్తిని పంచుకున్నారని ఆరోపించారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత కూతురు మిసా భారతిని గెలిపించడంలో లాలూ ప్రసాద్ విఫలమయ్యారు. కేసీఆర్ కూడా  ఆయన కుమార్తె కవిత విషయంలో ఇలానే జరిగింది’’ అని ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios