నెలలో 21 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే వుండాలని నేతలకు క్లాస్ పీకారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేలు పిల్లల కోడిలాగా.. అందరినీ కాపాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు పిల్లల కోడిలాగా వుండాలి.. అందరినీ కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈసారి ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అందరనీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని.. తాను ప్రతీది లోతుగా గమనిస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు గుప్పించారు కేసీఆర్. మోడీ దేశాన్ని మోసం చేశాడని.. గుజరాత్ మోడల్ ఓ బోగస్ అని సీఎం వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులు కలుపుకుని వెళ్లాలని ఆయన ఆదేశించారు. జూన్ 2 నుంచి జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలు, ఎంపీలను పిలవాలని కేసీఆర్ సూచించారు. నెలలో 21 రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజల్లోనే వుండాలని.. పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే వుంటుందని సీఎం హెచ్చరించారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదన్న ఆయన.. దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని దుయ్యబట్టారు.
ALso Read: ప్రజల్లోకి వెళ్లాలి.. పైపై ప్రచారాలొద్దు , టికెట్లు వాళ్లకే ఇస్తా : ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ కు 104 సీట్లు వస్తాయని కేసీఆర్ చెప్పారు. గత పదేళ్లలో ప్రజలకు ఏం చేశామో ప్రజలకు వివరించాలని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు చేసిన సేవ గురించి వివరిస్తే చాలన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఆయా జిల్లాల్లో మంత్రులు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులను తెలంగాణ వచ్చిన తర్వాత మారిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని కేసీఆర్ కోరారు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యే ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే ఐదు నెలలే ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూర్తిగా నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆయన సూచించారు.
