మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి త్వరలోనే కమిటీలు నియమించుకుందామన్నారు సీఎం కేసీఆర్. నాందేడ్‌లో శుక్రవారం బీఆర్ఎస్ శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు
దేశంలో మార్పు తీసుకురావడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని నాందేడ్‌లో శుక్రవారం బీఆర్ఎస్ శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం మార్పు రావడానికి మహారాష్ట్ర నాంది పలకనుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ధాల పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసిందేమి లేదని కేసీఆర్ దుయ్యబట్టారు.
మహారాష్ట్రలో పలు చోట్ల వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్ధితి వుందన్నారు. .. తెలంగాణలో తాము ఇంటింటికి నీరు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర- తెలంగాణ మధ్య ప్రత్యేక అనుబంధం వుందన్నారు. మన లక్ష్యం గొప్పదన్న ఆయన.. త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని పేర్కొన్నారు. పుష్కలంగా నీటి వనరులున్నా వాడుకోలేక వృథా చేస్తున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం తెలంగాఫణ మోడల్ కావాలని కోరుకుంటోందని సీఎం పేర్కొన్నారు. రైతులు పోరాటాలు చేస్తూ బలి కావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. భారత్ కంటే చిన్న దేశాలైన సింగపూర్, మలేషియాలు గొప్పగా అభివృద్ధి చెందాయని కేసీఆర్ పేర్కొన్నారు.
ALso Read: ఎమ్మెల్యేలు పిల్లల కోడిలా వ్యవహరించాలి.. అందరినీ గమనిస్తా, 95 నుంచి 105 సీట్లు బీఆర్ఎస్‌కే : కేసీఆర్
ప్రతి ఏటా వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రం పాలవుతున్నాయని సీఎం తెలిపారు. కర్ణాటక ఫలితాల తర్వాత కొందరు రకరకాలుగా మాట్లాడారని ఆయన ఫైరయ్యారు. నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్య పరచాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జెండా ఎత్తుకునే ముందు పోరాటం చేయాలని.. కడదాకా పోరాడే వారే బీఆర్ఎస్‌లో చేరాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు కానీ పార్టీలు కాదన్నారు. దేశంలోని రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే సమస్యలు పరిష్కరించామని కేసీఆర్ చెప్పారు.
