తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి సమస్యను నడిరోడ్డుపైనే పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్తుండగా మార్గమాధ్యంలో టోలీచౌకి మీదుగా వస్తున్నారు.

ఈ క్రమంలో రోడ్డుపై వికలాంగుడైన ఓ వృద్దుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. అతనిని చూసిన ముఖ్యమంత్రి వెంటనే కారు దిగి పెద్దాయన దగ్గరకి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు.

Also Read:ట్రంప్‌తో చేయి కలిపిన కేసీఆర్, కాసేపు ముచ్చట్లు

తన పేరు మహ్మద్ సలీమ్ అని పరిచయం చేసుకున్న అతను గతంలో తాను డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి జారీపడటంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాలేదని, ఉండటానికి ఇల్లు కూడా లేదని సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.

అతని బాధ చూసి చలించిపోయిన కేసీఆర్ వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని సీఎం ఆదేశించారు.

Also Read:ట్రంప్ విందుకు జగన్ కు నో, కేసీఆర్ కు ఎంట్రీ వెనుక కథ ఇదే....

కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కలెక్టర్ టోలిచౌకిలోని సలీమ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడిని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ జారీ చేసి పెన్షన్ మంజూరు చేశారు. అలాగే జియాగూడలో డబుల్ బెడ్‌రూమ్ సలీం కుమారుడికి ప్రభుత్వ ఖర్చులతో వైద్య పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.