బీహర్ లో సీఎం కేసీఆర్ టూర్: గాల్వాన్ అమర జవాన్లకు ఆర్ధిక సహాయం అందజేత
గాల్వాన్ లోయలో మరణించిన అమర జవాన్లతో పాటు సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహరం అందించింది.
పాట్నా: గాల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో మరణించిన బీహార్ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ , బీహార్ సీఎంలు బుధవారం నాడు చెక్ లు పంపిణీ చేశారు.చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన భారత జవాన్లకు రూ. 10 లక్షలు అందిస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు చెక్ లు పంపిణీ చేసేందుకు ఇవాళ ఉదయం బీహార్ కు వెళ్లారు.
also read:బీహర్ కి బయలు దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్: జాతీయ రాజకీయాలపై నితీష్ తో చర్చ
అదే విధంగా సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కార్మికులకు రూ. 5 లక్షల చెక్ లను అందించారు సీఎం కేసీఆర్ ,బీహార్ సీఎం నితీష్ కుమార్. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో మరణించిన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు, సికింద్రాబాద్ బోయిగూడలో మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో కేసీఆర్ పాట్నాకు చేరుకున్నారు. పాట్నా విమానశ్రయంలో సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లు స్వాగతం పలికారు.
సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 23న చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పైరింజన్లకు సమాచారం ఇచ్చారు. అయితే 8 పైరింజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ఈ ప్రమాదంలో బిట్టు, సికందర్, దినేష్, దామోదర్, చింటు, సికిందర్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్, గోలు మరణించారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న ప్రేమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరంతా బీహర్ రాష్ట్రానికి చెందిన వారు. మృతుల కుటుంబాలకు పరిహరం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ బీహర్ కు వెళ్లి బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు అందించారు. టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని గుర్తించారు.
2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా జవాన్లతో భారత జవాన్లకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారు.
2020 మే 10న రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సరిహద్దుల్లో గస్తీ నిర్వహించే జవాన్ల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. రెండు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. ఈ ఉద్రిక్తతలను నివారించేందుకు చేసిన ప్రయత్నాలు కొంత పలితం ఇచ్చినట్టుగానే కన్పించాయి. కానీ జూన్ లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా, ఇండియా జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గాల్వాన్ లోయలో జరిగిన పరిణామాల్లో 20 మంది భారత జవాన్లు మరణించారని భారత్ ప్రకటించింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.