Asianet News TeluguAsianet News Telugu

నీ ప్రభుత్వం కూలుతుందని మోడీనే అన్నారు.. దొంగల్ని పట్టుకుని లోపలేశాం : ఫాంహౌస్‌ కేసుపై కేసీఆర్

తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న మొయినాబాద్ ఫాంహౌస్ కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీనే.. తన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారని, ఇటీవల నలుగురు దొంగల్ని పట్టుకుని లోపలేశామని కేసీఆర్ గుర్తుచేశారు. 
 

telangana cm kcr fires on pm narendra modi over moinabad farm house case
Author
First Published Dec 4, 2022, 5:26 PM IST

ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతామంటారని.. స్వయంగా ప్రధాని మోడీనే ప్రభుత్వాన్ని పడగొడతానని అంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గతంలో వలసలు , ఆత్మహత్యలు, ఆకలి చావులతో పాలమూరులో భయంకరమైన పరిస్ధితులు వుండేవన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ రోజు పాలమూరు అంటే కరువు జిల్లా కాదని పచ్చటి జిల్లా అని సీఎం అన్నారు. కేంద్రం మన నీటి వాటా తేల్చడం లేదని.. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చని పంటలు పండే రోజు రాబోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించుకున్నామన్నారు .

మహబూబ్‌నగర్‌కు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నాయని సీఎం అన్నారు. మంచినీరు, కరెంట్ కొరత తీరిందని.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో వున్న ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా వెంటనే రూ.5 లక్షలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాకముందు పాలమూరులో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా ఊహించారా అని సీఎం ప్రశ్నించారు. జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయన్న కేసీఆర్.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదని ఫైర్ అయ్యారు.

ALso REad:నోటీసులపై కల్వకుంట్ల కవిత స్పందన... ముందు ఆ రెండు డాక్యుమెంట్లు పంపండి : సీబీఐకి లేఖ

డైలాగులు, ఉత్తమాటలతో అభివృద్ధి కాదని సీఎం అన్నారు. మనతో సమానంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం అన్నారు. రాష్ట్రానికి వచ్చి మోడీ డంబాచారాలు చెబుతున్నారని.. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. కాళ్లలో కట్టెలు పెడతాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. మేం చేయం వాళ్లను చేయనివ్వం అన్న విధంగా కేంద్రం తీరు వుందని సీఎం ఎద్దేవా చేశారు. కేంద్రం తీరుపై గ్రామాల్లో చర్చ పెట్టాలని.. దేశంలో ఏం జరుగుతోందో యువకులు, మేధావులు ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. ఢిల్లీలో అసమర్ధ ప్రభుత్వం వుందన్న ఆయన.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ తాగడానికి నీళ్లు లేవన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు, మంచినీళ్లు రావని కేసీఆర్ చురకలంటించారు. రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డుపడతారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. 

కేసీఆర్ నీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రధాని అన్నారని.. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా వుంటుందా అని సీఎం ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారని కేసీఆర్ ఆరోపించారు. విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని.. మొన్న హైదరాబాద్‌కు దొంగలు వచ్చారని , టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటే దొరకబట్టి జైల్లో వేశామని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాజకీయాల్లోకి అందరం కలిసిపోదామని.. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి పాటుపడదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేద్దామన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios