బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడిందని.. సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టిందని కేసీఆర్ గుర్తుచేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ నోటికి వచ్చినట్లు మాట్లాడిందని కేసీఆర్ మండిపడ్డారు. నుపుర్ శర్మ వ్యాఖ్యల్ని తప్పుబడితే సుప్రీంకోర్టుపై కూడా లేఖలు రాయిస్తారా అని సీఎం ప్రశ్నించారు. నుపుర్ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టిందని... ఆ న్యాయమూర్తులకు తాను సెల్యూట్ చేస్తున్నానని కేసీఆర్ ప్రశంసించారు. దేశంలో బీజేపీయేతర డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు రావాలని.. బీజేపీకి కళ్లు నెత్తికెక్కాయని సీఎం మండిపడ్డారు. దేశంలో ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని... పార్టీలను, నాయకులను భయపెడతారని ఇదేం ప్రభుత్వమని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
జడ్జిలనే బెదిరిస్తున్నారని.. ఇదేనా న్యాయవ్యవస్థపై మీకు వున్న గౌరవం అంటూ ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలుస్తున్నారని.. మాజీ జడ్జిలను తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిలను ట్రోల్ చేస్తారా అంటూ సీఎం మండిపడ్డారు. కట్టప్ప కథ ఈ సన్నాసికి తెలుసానంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా ముఠాగోపాల్ దెబ్బకు గింగిరాలు తిరిగాడన్నారు. ఢిల్లీలో కాళ్లు పట్టుకుని యూపీ నుంచి ఎంపీ అయ్యాడని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతుల్ని ఉగ్రవాదులు అన్నారని , మళ్లీ క్షమాపణలు చెప్పారని దుయ్యబట్టారు. రైతులు ఉగ్రవాదులైతే ఎందుకు క్షమాపణ చెప్పారని కేసీఆర్ ప్రశ్నించారు.
దేశ తలసరి ఆదాయం లక్షా 49 వేల 848 రూపాయలని.. తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల 833 రూపాయలని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయిందని... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతామని సీఎం స్పష్టం చేశారు. మోడీ చెప్పినట్లే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ పోయి తెలంగాణ లాంటి ప్రభుత్వం రావాలని సీఎం ఆకాంక్షించారు. యూపీ నుంచి ఒకాయన లుంగీ కట్టుకుని వచ్చాడని... ఆయన ఉపన్యాసం చెబితే మనం వినాలట అంటూ యోగి ఆదిత్యనాథ్ పై సెటైర్లు వేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా వుందని కేసీఆర్ గుర్తుచేశారు.
