కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై (Fertilizer price hike) ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గం అని అన్నారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై (Fertilizer price hike) ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేదిశగా కేంద్రం నిర్ణయం ఉందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఊదరగొట్టిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎరువుల ధరలు తగ్గించేవరకు పోరాటం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎరువుల ధరలు తగ్గించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయట్లేదని చెప్పారు. పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా కేంద్రం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసే కుట్రల జరుగుతన్నాయని ఆరోపించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక, ఎరువుల ధరలపై సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి ఈ రోజు సాయంత్రం లేఖ రాయనున్నారు.
ఇక, కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ కొంతకాలం తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను చేపడుతోందని విమర్శించారు. కేవలం ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని అన్నారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించేంత వర్గం కేసీఆర్ పోరాటం సాగిస్తారని టీఆర్‌ఎస్ వర్గాల పేర్కొన్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో చేతులు కలుపుతామని తెలిపాయి. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే కేసీఆర్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్.. శనివారం సీపీఐ, సీపీఎం జాతీయ నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఇక, మంగళవారం ఆర్డేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆ పార్టీ బృందంతో కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి అవసరమని సమాలోచనలు జరిపారు. బీజేపీ అన్ని వర్గాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని.. దానిని గద్దె దించాల్సిన అవసరం ఉందనే సమావేశంలో ఇరు పార్టీలు అభిప్రాయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి
