75 th Independence Day: రాజ్ భవన్ ఎట్ హోంకు హాజరు కానున్న కేసీఆర్
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరౌతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్టు 15వ తేదీ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం నిర్వహిస్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య కొంతకాలంగా అగాధం కొనసాగుతుంది.ఈ తరుణంలో ఇవాళ జరిగే ఎట్ హోం కార్యక్రమానికి సీఎం హాజరౌతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
also read:స్వాతంత్య్ర సమరయోధులు ఆత్మలు ఘోషించేవి.. పంద్రాగస్టు వేదికగా కేంద్రంపై కేసీఆర్ ఫైర్
ఈ ఏడాది జూన్ 28వ తేదీన తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భయాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. అప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మధ్య అగాధం కొనసాగుతుంది. ఈ తరుణంలో హైకోర్టు చీప్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సుమారు తొమ్మిది నెలల తర్వాత రాజ్ భవన్ లో ఆయన అడుగు పెట్టారు. ఈ కార్యక్రమానికి కూడా కేసీఆర్ వెళ్తారో వెళ్లారో అని అంతా ఆసక్తిగా చూశారు. కానీ ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కేసీఆర్ నవ్వుతూ మాట్లాడారు.
దీంతో గవర్నర్ కు, కేసీఆర్ కు మధ్య చోటు చేసుకొన్న అగాధం ముగిసినట్టేనని భావించారు. కానీ ఆ తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. గోదావరికి వరదలు వచ్చిన సమయంలో గవర్నర్ తమిళిసై భద్రాచలం జిల్లాలో పర్యటించారు. అదే సమయంలో కేసీఆర్ కూడా భద్రాచలం జిల్లాలో పర్యటించారు. గవర్నర్ భద్రాచలం టూర్ లో కూడా ప్రోటోకాల్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ నెల 7న బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ తమిళిసై సందర్భించారు. ఈ సమయంలో కూడా ప్రోటోకాల్ ను అధికారులు పాటించలేదనే విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం మానేశారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆరోపించారు.
బాసర ట్రిపుల్ ఐటీ టూర్ కి ముందు పలు యూనివర్శిటీలకు చెందిన విద్యార్ధులు హైద్రాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. తమ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు.దీంతో యూనివర్శిటీల పర్యటనను చేపట్టనున్నట్టుగా తమిళిసై ప్రకటించారు. అంతేకాదు యూనివర్శిటీల టూర్ ను నిర్వహించారు.