ఆటోలో తిరిగే నిరాడంబర మాజీ ఎమ్మెల్యే మృతి: కేసీఆర్, ఎర్రబెల్లి సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రాజయ్య మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజయ్య చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు.
''సున్నం రాజయ్య నిజాయితీ, నిబద్ధత గల నాయకుడు. ఆజన్మాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకుని ఆచరించిన ఆదర్శ నేత. అసెంబ్లీలో ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపిన నాయకుడు. అసెంబ్లీకి ఆటోలో వచ్చిన నిరాడంబరుడు. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి సానుభూతి తెలియచేస్తూ, ఆయన లేని లోటుతో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా'' అని అన్నారు.
read more తెలంగాణలో కరోనా విజృంభణ: 69 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో రాజయ్య కరోనా వల్ల తీవ్ర జ్వరంతో బాధపడుతూ.... ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజయ్య మృతి చెందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుండి 2 పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. ఆయన మృతిపట్ల పలువురు కమ్యూనిస్టు నాయకులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.