మానేరులో పడి ముగ్గురు బాలురు మృతి.. కేసీఆర్ దిగ్భ్రాంతి, రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా
కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో మానేరు వాగులో పడి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన నష్టపరిహారం ప్రకటించారు.
కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో మానేరు వాగులో పడి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క విద్యార్ధికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. రేపు మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. ఈ ఘటనపై మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ.. హోళి పండుగ రోజు ముగ్గురు పిల్లల మృతి చెందడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు , అధికారులకు మంత్రి గంగుల ఆదేశాలు జారీ చేశారు. మృతులు కుటుంబాలకు అండగా ఉంటామని గంగుల హామీ ఇచ్చారు. అలాగే వారి కుటుంబాలకు మంత్రి గంగుల వ్యక్తిగంగా మరో 2 లక్షల రూపాయలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
ALso REad: కరీంనగర్ :హోలీ పండుగ నాడు విషాదం.. మానేరు నదిలో మునిగి ముగ్గురు బాలురు మృతి
కాగా.. మంగళవారం మానేరు రివర్ ఫ్రంట్ వాటర్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కు చెందిన వారు. హోలీ వేడుకల్లో పాల్గొని అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ నీటిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. వీరంతా ప్రకాశం జిల్లా చీమకుర్తిగా చెందిన వారిగా తెలుస్తుంది. మృతుల తల్లిదండ్రులు వలసకూలీలుగా జీవనం సాగించేవారని సమాచారం. మృతులను వీరాంజనేయులు (16), సంతోష్ (13), అనిల్ (14)గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఒకేసారి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.