రాష్ట్రంలో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, మేడ్చల్, గద్వాల్, వికారాబాద్ సహా మరో రెండు జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు. ఆరెంజ్ జోన్‌లో 18 జిల్లాలు, గ్రీన్‌జోన్‌లో 9 జిల్లాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను అతిక్రమించలేమని మరో ఐదారు జిల్లాలు ఈరోజే గ్రీన్‌జోన్‌లోకి వెళ్తాయని... అలాగే వచ్చే 11 రోజుల్లో 18 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి వెళ్తాయని సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయని.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎట్టి పరిస్ధితుల్లో రాజీపడలేమని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 29 మంది చనిపోతే 25 మరణాలు ఈ రెండు జిల్లాల్లోనే నమోదయ్యాయని... ముంబై పరిస్ధితి మనకు రావొద్దని సీఎం అన్నారు.

చైనా నుంచి చాలా కంపెనీల దృష్టి దక్షిణ భారతదేశం మీద ఉందని... ముఖ్యంగా కంపెనీల దృష్టి హైదరాబాద్‌పైనే ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. భాగ్యనగరాన్ని సేఫ్‌గా ఉంచుకోవడం మన బాధ్యత అన్నారు.

రాష్ట్రం మొత్తం కరోనా ఫ్రీగా మారుతోందని... తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇంకొన్నాళ్లు ఓపిక పడితే కరోనాను పూర్తిగా జయించగలమని.. 65 ఏళ్లు దాటినవారు బయటకు రాకుండా చూడాలని సీఎం సూచించారు.

గృహ నిర్మాణాలకు సంబంధించిన దుకాణాలు తెరచుకుంటాయని.. ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ షాపులు కూడా తెరుచుకుంటాయని కేసీఆర్ తెలిపారు. జోన్‌ల వారీగా కేంద్రం మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేస్తామని.. వ్యవసాయ పనులు దానికి సంబంధించిన దుకాణాలకు అనుమతి ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

రెడ్‌జోన్లలో ఎలాంటి షాపులకూ అనుమతి లేదని ఆయన తేల్చిచెప్పారు. మే 15న రివ్యూ సమావేశం నిర్వహించి దేశంలోని నగరాల పరిస్ధితిపై చర్చించి తదుపరి నిర్ణయం వెలువరిస్తామని సీఎం అన్నారు.

27 జిల్లాల్లో అన్ని షాపులు నడుస్తాయని... మండల కేంద్రం, గ్రామాల్లో అన్ని షాపులు తెరచుకోవచ్చని అయితే రాష్ట్ర వ్యాప్తంగా జోన్లతో సంబంధం లేకుండా రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ పనిచేస్తుందని బుధవారం నుంచి భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుకోవచ్చని సీఎం తెలిపారు. మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని.. ఒక్కో హాల్లో 20 మంది విద్యార్ధులు ఉండేలా పరీక్షలు నిర్వహిస్తామని  కేసీఆర్ ప్రకటించారు.

ఆర్‌టీఏ ఆఫీసులు, ఇసుక మైనింగ్ ఆఫీసులు కూడా పనిచేస్తాయని.. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇది రేపో ఎల్లుండో సమసిపోయే సమస్య కాదన్న ఆయన కరోనాతో కలిసి బతకాల్సిందేనన్నారు.

ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా పూర్తి చేస్తామని.. లాయర్ల కోసం రూ.22 కోట్ల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వలస కూలీలను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి.. తెలంగాణలో ఉండి పనిచేయాలనుకునే వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఉదయం 10  నుంచి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు  తెరచుకుంటాయని.. పట్టణాల్లో లాటరీ పద్ధతిలో దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు.