ఈ నెల 25న జరగనున్న అపెక్స్ కమిటీ సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలను కేంద్రం నివృత్తి చేయాలని.. అలాగే తెలంగాణ అభ్యంతరాలను కౌన్సిల్‌లో లేవనెత్తుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

25న సమావేశానికి అంగీకారం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాస్తామని.. తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టలేదని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే తాము రీడిజైన్ చేశామని.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు అనుగుణంగానే నీటి వాడకం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read:తెలంగాణతో జలవివాదం... అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తవని.. వీటిపై అభ్యంతరాలు చెప్తామని సీఎం స్పష్టం చేశారు. నీటి కేటాయింపులు, అనుమతి లేకున్నా కృష్ణానదిలో అక్రమంగా నీటి వాడకం జరుగుతోందని.. ఈ విషయంపై సమావేశంలో నిలదీస్తామని కేసీఆర్ చెప్పారు.

దీని కోసం సమగ్ర సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లపై కేంద్రం, ఏపీ అభ్యంతరాల్లో అర్ధం లేదన్న ఆయన.. నదీ జలాల వినియోగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు  చేశామని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరతామన్నారు.