Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణతో జలవివాదం... అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఆగస్ట్ 20వ తేదీన ఇరు  తెలుగురాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. 

Apex Council meeting on Telangana, AP water disputes... cm jagan orders to irrigation officers
Author
Amaravathi, First Published Aug 13, 2020, 10:58 AM IST

అమరావతి: ఆగస్ట్ 20వ తేదీన ఇరు  తెలుగురాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుల విషయంలో వాదనను గట్టిగా వినిపించేలా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.  ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో తెలంగాణ అభ్యంతరాలపై అపెక్స్ కౌన్సిల్ లో రాష్ట్ర వాదన వినిపించేందుకు అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. 

ఇలా అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించేందుకు సిద్దమవుతూనే మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వేగంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఇప్పటికే పథకం నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలవగా నవయుగ,  మ్యాక్స్ ఇన్ఫ్రా, ఎస్పీఎంఎల్-ఎన్ సీసీ సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ఈ నెల 17న ఫైనాన్స్ బిడ్, అదేరోజు రివర్స్ టెండెరింగ్ చేపట్టనున్నారు. ఈ నెల 19న రాష్ట్రస్థాయి సాంకేతిక నిపుణుల కమిటీ ఆమోదం కోసం పంపనుంది ప్రభుత్వం.

read more   జగన్ కు ఆనాడే చంద్రబాబు హెచ్చరిక: ఇప్పుడు కేసీఆర్ తో నీటి యుద్ధం

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేది. కానీ ప్రాజెక్టుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు తమ వాదనలను సమర్ధించుకొంటున్నాయి. త్వరలోనే జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలను విన్పించనున్నాయి. మరో వైపు ఈ విషయంపై ఇరు రాష్ట్రాలు కోర్టులను కూడ ఆశ్రయించాయి .

 ఏపీ ప్రభుత్వంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ నదీ జలాల వాటా విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగనివ్వమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా  ఈ నెల 9వ తేదీన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
మరోవైపు ఏపీ సీఎంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ ఈ నెల 10వ తేదీన సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులపై అనవసర ఆరోపణలు చేస్తోందని  కేసీఆర్ విమర్శలు చేశారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదీ జలాల్లో కేటాయించిన వాటాల మేరకు విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీటిని కేటాయించారు. 

 కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి రెండు రాష్ట్రాల అవసరాలకు నీటిని వాడుకోవాలని ఈ  ఏడాది ఆరంభంలో నిర్వహించిన సమావేశంలోనూ అంతకుముందు సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఈ విషయంలో  రెండు రాష్ట్రాల ఇంజనీర్లు సర్వే  చేశారు. కానీ, రెండు రాష్ట్రాల మధ్య ఆమోదయోగ్యమైన ప్రదేశాన్ని గుర్తించలేదు. దీంతో ఈ ప్రతిపాదన అక్కడే నిలిచిపోయింది.దీంతో రెండు రాష్ట్రాలు తమ వాటాల మేరకు ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టికి కేంద్రీకరించాయి. 

 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చును పెట్టింది. ఈ ప్రాజెక్టే రెండు రాష్ట్రాల మధ్య ఆరోపణలకు ప్రత్యారోపణలకు తెర లేపింది. ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది.

 శ్రీశైలం నుండి ప్రతి రోజూ 3 టీఎంసీల నీటిని వాడుకొనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టుకు సుమారు రూ. 7 వేల కోట్లు ఖర్చు అవుతోందని అంచనా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి సుమారు 80 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేయాలని ప్రతిపాదించారు.

 ఇదే తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ సర్కార్ వాదిస్తోంది. శ్రీశైలం నుండి సాగర్ కు నీళ్లు కూడ వచ్చే అవకాశం ఉండదని తెలంగాణ వాదిస్తోంది.ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్రం అభిప్రాయంతో ఉంది. 

 ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లను కూడ నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అంతేకాదు కృష్ణా బోర్డుకు కూడ ఫిర్యాదు చేసింది.కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నాయి. 

పోతిరెడ్డిపాడు కొత్త ప్రాజెక్టు కాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. తెలుగుగంగ, ఎస్ఆర్‌బీసీ, గాలేరు నగరి, కేసీ కెనాల్ ఆయకట్టుుకు నీటిని అందించేందుకు ఉద్దేశించినట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది.శ్రీశైలంలో 880 అడుగుల నీరున్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని వాడుకొనే వీలుంటుంది. దీంతో తెలంగాణ వాడుకొంటున్నట్టుగా 800 అడుగుల నుండే నీటిని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు ప్రాజెక్టును ప్రతిపాదించింది.

శ్రీశైలంలో 800 అడుగుల నుండే రోజుకు మూడు టీఎంసీలను తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులను చేపట్టిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 
796 అడుగుల నుండే  రోజూ 42 వేల క్యూసెక్కులను తెలంగాణ వాడుకొనేలా డిజైన్ చేసిందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరో వైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నిర్మించేందుకు తెలంగాణ నిర్మిస్తోందని కూడ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుతో పాటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పై కూడ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఈ విషయమై చర్చించారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios