Asianet News TeluguAsianet News Telugu

రేపు పొద్దున్న డ్యూటీకి రండి: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ లాస్ట్ ఛాన్స్

ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని తాము నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ శుక్రవారం ఉదయం యధావిథిగా విధులకు హాజరు కావొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. 

Telangana cm kcr announce his decision on tsrtc strike
Author
Hyderabad, First Published Nov 28, 2019, 7:41 PM IST

ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని తాము నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ శుక్రవారం ఉదయం యధావిథిగా విధులకు హాజరు కావొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమే తమకు రూ.22 వేల కోట్లు ఇవ్వాలని, కానీ కేంద్రం వాటా గురించి చెప్పేవాళ్లు ఈ డబ్బు ఇప్పిస్తారా అని సీఎం ప్రశ్నించారు.

ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి నష్టాలను పూడ్చేందుకు ఆసరా కల్పిస్తామని... కి.మీ.20 పైసలు చొప్పున పెంచుతామని సోమవారం నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయని సీఎం స్పష్టం చేశారు.

Also Read:సమ్మెపై కేసీఆర్ మాస్టర్ మైండ్: ఆయనను గైడ్ చేస్తోంది ఆ ఇద్దరే! ఇంతకీ ఎవరు వారు..

కార్మికులు విధుల్లో చేరడానికి ఎలాంటి షరతులు లేవని... త్వరలో కార్మికులతో తానే స్వయంగా మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు. మేమన్న ప్రైవేటీకరణ వేరని... బయట ప్రచారం చేసింది వేరని, ప్రైవేట్ పర్మిట్లు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇద్దామనుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వచ్చే వారంలో ప్రతి డిపో నుంచి ఐదుగురిని పిలిచి తానే స్వయంగా మాట్లాడతానని సీఎం తెలిపారు. ఆర్టీసీ ఆర్ధిక పరిస్ధితిని 49 వేల మంది కార్మికులకు తెలియజేస్తామని...యూనియన్ నేతలను దగ్గరకి రానివ్వమని కేసీఆర్ వెల్లడించారు. 

సమ్మెకాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అయితే ఆర్టీసీలో లేదంటే ప్రభుత్వంలో ఉద్యోగం లభిస్తుందన్నారు. క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా గుండెల్లో పెట్టుకుంటామని సీఎం తెలిపారు.

యూనియన్ల ఉన్మాదంలో పడొద్దని... తన మాట వింటే కార్మికులకు బోనస్ వస్తుందని, వాళ్ల మాటలు వింటే బజారున పడతారని కేసీఆర్ హెచ్చరించారు. యూనియన్లు లేని ఆర్టీసీ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము ఎవరి పొట్టను కొట్టలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు.  గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది.. ఈ సందర్భంగా భేటీ వివరాలను సీఎం మీడియాకు తెలిపారు.

అన్ని విభాగాల్లోనూ అత్యధిక వేతనాలు పొందే ప్రభుత్వోద్యోగులు తెలంగాణలో మాత్రమే ఉన్నారు. 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులు యూనియన్ నేతల మాయమాటల వల్ల ఇంతదూరం వచ్చిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీ విలీనం కాలేదని... కానీ ఇక్కడ మాత్రమే ఆర్టీసీ విలీనం చేయాలంటూ పట్టుబట్టడం దారుణమన్నారు.

జరిగే పరిణామాలకు ప్రతిపక్షాలు బాధ్యత వహించవని.. కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడతాయని సీఎం మండిపడ్డారు. ప్రతిపక్షాలకు బాధ్యత ఉంటే... అప్పుడే కార్మికులకు చెప్పాలన్నారు. లేబర్‌కోర్టు చెప్పక్కర్లేదని... కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మెలో ఉన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. 

రాష్ట్రంలో ఈ ఏడాది మంచి వర్షాలు కురిశాయని.. అదే సమయంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు నాశనమయ్యాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో రోడ్ల పరిస్ధితులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించామన్నారు.

Also Read:ఆర్టీసీ సమస్యకు విఆర్ఎస్... అదనపు భారం ఎంతో తెలుసా...?

రాజధాని హైదరాబాద్‌లో రోడ్లు భారీ వర్షాలకు ఘోరంగా దెబ్బతిన్నాయని కేసీఆర్ తెలిపారు. రోడ్లకు మరమ్మత్తులు జరుగుతున్నాయని... ఇందుకోసం రూ.571 కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు.

మంచి వర్షాల వల్ల ధాన్యం దిగుబడి పెరిగిందని...రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios