భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అంతిమంగా దేశంలో వున్న వ్యవసాయ రంగాన్ని, రైతుని కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెడుతోందని ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

శనివారం ఇందిరాపార్క్‌లో నిరసన దీక్ష చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని సైతం కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడే చట్టాలుగా మోడీ తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగాన్ని, ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేసిందని భట్టి గుర్తుచేశారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తులు ఈస్టిండియా కంపెనీ పేరుతో మనదేశానికి వచ్చి యావత్ దేశాన్ని కబళించిందని విక్రమార్క తెలిపారు.

అలాంటి కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి దేశాన్ని పెట్టేందుకు మోడీ తెరదీసిన కార్యక్రమానికి ఈ మూడు చట్టాలతో నాంది పలికారని ఆయన ఆరోపించారు. ఈ చట్టాలను ఆపకపోతే... ఆనాడు ఈస్టిండియా కంపెనీ పేరిట ఏరకంగా దేశాన్ని కబళించారో, మరోసారి దేశ ప్రజాస్వామ్యాన్ని కబళించి, పరిపాలను వారి చేతుల్లోకి తీసుకుంటారని ఆయన దుయ్యబట్టారు.

అందుకే ఈ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్లమెంట్‌లో పోరాడిందని భట్టి గుర్తుచేశారు. కానీ మెజార్టీ బీజేపీతో కావడంతో చట్టాలను ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు.

అనంతరం 2 కోట్లమంది సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేశామన్నారు. భారత దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదకరంగా మారిన ఈ మూడు చట్టాల గురించి తప్పనిసరిగా పోరాటం చేయాల్సిన అవసరం వుందని విక్రమార్క తెలిపారు.

అంబానీ, అదానీలతో కోర్టుల్లో పోరాటం చేసే శక్తి రైతులకు ఉంటుందా అని భట్టి ప్రశ్నించారు. కార్పోరేట్ శక్తులు.. ప్రజలకు ఆహార పదార్ధాలు అందుబాటులోకి రాకుండా కృత్రిమ కొరత సృష్టిస్తారని ఆయన ఆరోపించారు.

ఇదే జరిగితే దేశంలోని పేద, బడుగు వర్గాలకు ఆకలి చావులు తప్పవని భట్టి హెచ్చరించారు. దీనిని గమనించిన ఉత్తరాది రైతులు చలిని సైతం లెక్కచేయకుండా కొద్దిరోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారని విక్రమార్క గుర్తుచేశారు.