రాజకీయాల్లో తన ప్రస్థానం ముగిసిందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో ఆయన శకం మొదలైందని సోనియా అన్నారని ఆయన పేర్కొన్నారు.
రాజకీయాలకు సోనియా గాంధీ రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో ఆయన శకం మొదలైందని సోనియా అన్నారని భట్టి తెలిపారు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో తీర్మానాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గొప్ప నేతగా ఎదిగారని భట్టి ప్రశంసించారు. మల్లిఖార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని అందుకే సోనియా గాంధీ ఆయనను ఎంపిక చేశారని విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తారని భట్టి జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో అన్ని లౌకికవాద శక్తుల్ని, భావజాలాల్ని కలుపుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు అసాధ్యమన్నారు.
ALso REad: రిటైర్మెంట్ కాదు.. రాజకీయాల్లోనే సోనియా గాంధీ, ఆమె చెప్పింది వేరే: కాంగ్రెస్ వివరణ
అంతకుముందు సోనియా గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. ‘‘2004, 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వంతో సాధించిన విజయాలు నాకు వ్యక్తిగతంగా సంతృప్తిని ఇచ్చాయి. అయితే కాంగ్రెస్ కు కీలక మలుపు అయిన భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుంది’’ అని సోనియా గాంధీ అన్నారు. ఆమె తన ప్రసంగంలో అధికార బీజేపీ గురించి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ ఒక్క సంస్థను కాషాయ పార్టీ బంధించి, నాశనం చేస్తోందని విమర్శించారు. ‘‘ఇది కాంగ్రెస్ కు, దేశం మొత్తానికి సవాలుతో కూడిన సమయం. దేశంలోని ప్రతీ ఒక్క సంస్థను బీజేపీ-ఆరెస్సెస్ ఆక్రమించుకున్నాయి. కొంతమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక వినాశనానికి కారణమైంది.’’ అని అన్నారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీని ఓడించడానికి భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని తమ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీని ప్రజావ్యతిరేక పార్టీగా అభివర్ణించిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు త్యాగాల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలను ప్రస్తావిస్తూ దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడ్డాయని ఖర్గే పునరుద్ఘాటించారు. చైనా సరిహద్దు చొరబాట్లు, ప్రాదేశిక వివాదాలపై పదేపదే జరుగుతున్న చర్చను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
