తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన పోలవరం ప్రాజెక్ట్ అంశంపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. నిండా మునిగిన తర్వాత కేసీఆర్ మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. 

గోదావరి పరివాహక ప్రాంతంపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( bhatti vikramarka) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లు సాంకేతిక నిపుణులతో కట్టాలని కోరారు. పోలవరం కడితే ముంపు తప్పదని ఆనాడే చెప్పానని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. మేమే డిజైన్ చేస్తాం.. మేమే కట్టిస్తాం అని అనుకుంటే ప్రమాదకరమని భట్టి విక్రమార్క హెచ్చరించారు. బిల్లులో ఏడు మండలాలను తొలగించేలా సోనియా గాంధీని (sonia gandhi) ఒప్పించామని ఆయన తెలిపారు. ఏడు మండలాలను ఆంధ్రకు మోడీ 
(narendra modi) దారాదత్తం చేశారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మేము కొట్లాడి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించామని.. పోలవరం ఎత్తును 3 మీటర్లు పెంచితే ఏం చేస్తున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించారా.. లేదా అని ఆయన నిలదీశారు. నిండా మునిగిన తర్వాత కేసీఆర్ మాట్లాడటం ఏంటని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ గూగుల్ మ్యాప్ చూసే కేసీఆర్ పోలవరం ఎత్తు ఎందుకు ఆపలేదని ఆయన సెటైర్లు వేశారు. భద్రాచలం కోసం ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. వరదలను డైవర్ట్ చేయడం కోసం బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రయోనాలకు నష్టం జరుగుతుంటే నిద్ర పోతున్నారని భట్టి మండిపడ్డారు. గతంలో కూడా భద్రాచలానికి రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారని విక్రమార్క గుర్తుచేశారు. 

Also Read:ఆ మండలాల్ని ఇవ్వాలా.. భద్రాచలాన్ని అడుగుతాం ఇచ్చేస్తారా, పాత గొడవల్ని మళ్లీ లేపొద్దు: పువ్వాడకు అంబటి కౌంటర్

మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం పార్లమెంట్‌లో కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తికాలేదని పేర్కొంది. పోలవరం నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి Bishweswar Tudu లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సిన ఉన్న పూర్తికాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే జాప్యం అవుతోందని తెలిపారు. 

ఇప్పటివరకు హెడ్ వర్క్స్ 77 శాతం, కుడి కాలువ పనులు 93 శాతం, పోలవరం ఎడమ కాలువ పనులు 72 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 2021 నవంబర్‌లో ఒక కమిటీని నియమించిందని తెలిపారు. అన్ని అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. 2022లో నివేదిక ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం గడువును 2024 జూన్ వరకు పొడిగించాలని కమిటీ సూచించిందని తెలిపారు.