Asianet News TeluguAsianet News Telugu

ఆ మండలాల్ని ఇవ్వాలా.. భద్రాచలాన్ని అడుగుతాం ఇచ్చేస్తారా, పాత గొడవల్ని మళ్లీ లేపొద్దు: పువ్వాడకు అంబటి కౌంటర్

పోలవరం ఎత్తు పెంపు వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. దీనిపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 

 minister ambati rambabu counter to telangana minister puvvada ajay kumar over his remarks on polavaram project
Author
Amaravati, First Published Jul 19, 2022, 4:43 PM IST

పోలవరం ప్రాజెక్ట్ (polavaram project) ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది. దీని వల్లే భద్రాచలంలో వరదలు పోటెత్తాయని తెలంగాణ మంత్రులు అంటుంటే.. ఏపీ మంత్రులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు సరికాదని.. బాధ్యతగల పదవిలో వున్నవాళ్లు ఇలా మాట్లాడటం సరికాదని అంబటి రాంబాబు హితవు పలికారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు వున్నాయని... ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని మంత్రి గుర్తుచేశారు. 

కాఫర్ డ్యాం ఎత్తు పెంపునకు సీడబ్ల్యూసీ అనుమతి వుందని అంబటి రాంబాబు తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయని.. మా భద్రాచలం తిరిగి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా అని అంబటి ప్రశ్నించారు. ఎప్పుడో ముగిసిన అంశాలపై ఇప్పుడు వివాదం సరికాదన్నారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకే ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని.. వివాదాలు వుంటే అందుకు తగిన వేదికలు వున్నాయని రాంబాబు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారానికి పనిచేయాలని ఆయన హితవు పలికారు. పోలవరం ఎత్తు పెంపుపై వివాదం మంచిది కాదని రాంబాబు స్పష్టం చేశారు. దశలవారీగా పోలవరం పూర్తి చేస్తామని... 45.72 మీటర్లకు సీడబ్ల్యూసీ నుంచే అనుమతులు వచ్చాయని మంత్రి తెలిపారు. భద్రాచలానికి గతంలో వరదలు రాలేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

Also REad:పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉంది: మంత్రి పువ్వాడ అజయ్

వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకున్నామన్నారు. వరద బాధితులను ఆదుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదని మంత్రి స్పష్టం చేశారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాంబాబు అన్నారు. మాది చంద్రబాబులా పిచ్చిమాటలు చెప్పే ప్రభుత్వం కాదని.. ఈనాడు తప్పుడు ప్రచారాన్ని తాము పట్టించుకోమని అంబటి తెలిపారు. కొన్ని పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయని.. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంత్రి రాంబాబు స్పష్టం చేశారు. 

అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా వున్నారని.. బాధితులకు రూ.2 వేలతో పాటు నిత్యావసరాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు ఈనాడుకు కనిపించవా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను కూడా ఈనాడులో వక్రీకరించి రాశారని అంబటి ఫైరయ్యారు. వక్రీకరించి వార్తలు రాయడమే ఈనాడు జర్నలిజమా అని ఆయన నిలదీశారు. అనని మాటల్ని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఎత్తిపోతల పథకాలపై అవాస్తవ కథనాలను రాశారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios