హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.గురువారం నాడు  బూర్గుల రామకృష్ణారావు భవన్ లో కరోనా స్థితిగతులపై  ఆయన  ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కూడ ఆయన  కలెక్టర్లను ఆదేశించారు.

ప్రతి ఒక్కరూ మాస్కలు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లను రెట్టింపు చేయాలని ఆయన సూచించారు.అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ వేగవంతం చేయాలని సీఎస్ కోరారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో సుమారు 3 వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. ఈ కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రోజుకు లక్షన్నర మందికి  వ్యాక్సినేషన్ చేస్తోంది. ఈ సమావేశంలో  మెడికల్ హెల్త్ సెక్రటరీ రిజ్వీ,మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ రమేష్ రెడ్డి , ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.