ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు జైలుకెళ్లక తప్పదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు.
హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారెంతటి వారైనా చర్లపల్లి జైలు ఊచలు లెక్కపట్టక తప్పదని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. శుక్రవారం నాడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ విషయమై మాజీ మంత్రి కేటీఆర్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తే తప్పేం ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఫోన్లు ట్యాపింగ్ చేశామని బరితెగించి కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఇలా బరితెగించి మాట్లాడితే ఫలితం కూడ అనుభవించాల్సి వస్తుందన్నారు. భార్యభర్తలు మాట్లాడుకొనే ఫోన్ సంభాషణ కూడ విన్న దుర్మార్గులంటూ గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు తాను చేసిన వినతిని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా వింటే ఆ తర్వాత ఆ పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వంలోని పెద్దల మాటలను విని ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఇవాళ జైలుకు వెళ్లారని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రజలు మాట్లాడుకొనే మాటలను వినాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై పక్కాగా విచారణ జరిపిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఇందుకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కేసులో అరెస్టైన భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకొని ఈ నెల 29 నుండి విచారిస్తున్నారు పోలీసులు.