పెండింగ్ లో నాలుగు ఎంపీ స్థానాలు: న్యూఢిల్లీకి రేవంత్ రెడ్డి
పెండింగ్ లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు.
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారంనాడు ఉదయం న్యూఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరగనుంది.ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు.ఆదివారం నాడు సాయంత్రమే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశం ఇవాళ్టికి వాయిదా పడింది. దరిమిలా రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయమే న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలున్నాయి.రాష్ట్రంలోని 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు చేరారు. ఇతర పార్టీల నుండి చేరిన నేతలకు కాంగ్రెస్ టిక్కెట్ల విషయమై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తుంది. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి మూడు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ దఫా తెలంగాణ రాష్ట్రం నుండి రెండంకెల స్థానాల్లో ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ నుండి బీఆర్ఎస్ 9 ఎంపీ స్థాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు కొందరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. టిక్కెట్లు కేటాయించిన ఇద్దరు అభ్యర్థులు తాము పోటీ చేయలేమని తేల్చి చెప్పడంతో ఈ రెండు స్థానాల్లో ఇతర అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది గులాబీ పార్టీ.