రేపు కేబినెట్ సమావేశం తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు.. ఆ ఇద్దరూ ఎవరు, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ
తెలంగాణలో గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను గురువారం జరిగే కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. దీంతో ఆ ఇద్దరు ఎవరనే దానిపై బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్‌లను కేసీఆర్ ప్రకటించారు. రేపు వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం ఉన్న నేపథ్యంలో వీరి ఎన్నిక లాంఛనమే . అయితే గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను గురువారం జరిగే కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. ఈ నెలాఖరుతో రాజేశ్వరరావు, ఫరూక్ హుస్సేన్‌ల పదవీకాలం ముగియనుంది.
మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించడంతో దేశపతి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా శ్రీనివాస్ నామినేషన్ వేయనున్నారు. మలిదేశ తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగిన సమయంలో కీలకంగా వ్యహరించిన కవులు, కళాకారుల్లో దేశపతి శ్రీనివాస్ ఒకరు.
ALso REad: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. పూర్తి వివరాలు ఇవే..
గజ్వేల్ సమీపంలోని మునిపడ గ్రామానికి చెందిన దేశపతి శ్రీనివాస్ విద్యాభ్యాసం సిద్ధిపేటలో గడిచింది. హైదరాబాద్‌లోని ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ తెలుగు చదివారు. అనంతరం 1998 నుంచి 2016 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు అండగా నిలిచారు. వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీల్లో తన ఆటపాటలు, రచనలు, ప్రసంగాలతో తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని వ్యాపింపజేశారు. 2014 నుంచి 2016 వరకు డిప్యూటేషన్‌పై సీఎం ఓఎస్డీగా పనిచేశారు. 2016లో టీచర్ వృత్తికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన దేశపతి శ్రీనివాస్ నాటి నుంచి పూర్తి స్థాయిలో ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలావుండగా.. తెలుగు రాష్ట్రాల్లో పది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23న పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలకు చివరికి తేదీ మార్చి 13 .