ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరు ఈ నెల 9న నామినేషన్‌లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక, మార్చి 9వ తేదీన ప్రగతి భవన్‌లో జరగనున్న మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
అభ్యర్థుల విషయానికి వస్తే.. కుర్మయ్యగారి నవీన్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. 2019లో ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ద్వారా నవీన్ కుమార్ శాసన మండలిలో అడుగుపెట్టారు. ఇక, నవీన్ కుమార్ తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అనే పేరుంది. ఈ క్రమంలోనే నవీన్ కుమార్‌ను మరోసారి మండలికి పంపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
చల్లా వెంకట్రామి రెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మనవడు. 2004లో అలంపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్తిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్ సమక్షంలో చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ కండువా కప్పకున్నారు. వెంకట్రామిరెడ్డికి మండలి సీటుపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఆ సమయంలోనే ఊహాగానాలు వచ్చాయి.
కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ యాసను, భాషను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను చాటడంలో తనవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన సీఎం ఓఎస్డీగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. దేశపతిని సీఎం కేసీఆర్ శాసనమండలికి పంపుతారనే ప్రచారం సాగింది. కానీ అలా జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించారు.
ఇక, గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కుర్మయ్యగారి నవీన్ కుమార్, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం సోమవారం ఎమ్మెల్యేల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 14న నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అయితే ఆయా స్థానాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. మార్చి 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ ఉన్నందున.. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.