2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఈ మేరకు బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

గురువారం ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌ భారీగా ఉంటుందని తెలుస్తోంది. సొంత రాబడులతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) జాతీయ సగటు కన్నా, ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది.

గత నాలుగు నెలలుగా పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి వచ్చే ఆర్థిక సం వత్సరంలోనూ వ్యయం కంటే రాబడి పెరుగగలదని అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. కరోనా సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ద్వారా సంపద అంచనాలకు మించి పెరిగింది.

సేవా, ఉత్పత్తి రంగాలు దెబ్బతిన్నప్పటికీ పంటల దిగుబడి భారీగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో పెట్టుబడి వ్యయం పెంచడంతో నీటిపారుదల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొన్నాయి.