కుల వృత్తులకు చేయూత.. కుటుంబానికి 1 లక్ష సాయం.. రెండు రోజుల్లో సబ్ కమిటీ విధి విధానాల ఖరారు..
కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ ఎంబీసీ కులాలు కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సిఎం స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న కుమ్మరి, కమ్మరి, మంగళి, చాకలి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. కులవృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం చేయూత నివ్వనున్నది. కులవృత్తుల ఆధారపడిన వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాల రూపకల్పనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటైన విషయం తెలిసిందే.
డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వృత్తి కులాలు, సంచార జాతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ ఎంబీసీ కులాలు కుల వృత్తుల ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సిఎం స్పష్టం చేశారు. రూ.1 లక్ష చొప్పున దశల వారీగా ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విధివిధానాలు రూపకల్పన, లబ్ధిదారుల ఎంపిక జరిగితే.. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లోనే ఆయా వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు, విధివిధానాలకు సంబంధించిన విషయాలను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని సీఎం కేసీఆర్ కు సబ్ కమిటీ చైర్మన్, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారంట. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి.. సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారట.
మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’ ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సిఎం కేసీఆర్ కు వివరించారు.