2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ హైదరాబాద్ ను ఒక గ్లోబల్ సిటీగా ప్రొజెక్ట్ చేసింది. శాంతి భద్రతల విషయంలో, రవాణా, టూరిజం, గ్రీనరీ, ఐటీ ఎగుమతుల విషయంలో, ఇతర సౌకర్యాల విషయంలో దేశంలోని మిగితా నగరాలతో పోల్చితే ఎంతో మెరుగ్గా ఉందని ఈ బడ్జెట్ తెలిపింది. 

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. మొద‌టి రోజు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు అసెంబ్లీలో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌సంగించారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్ 2,56,958.51 కోట్ల వ్యయంగా ప్ర‌తిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,89,274.82 కోట్లుగా, క్యాపిటల్ వ్యయం - 29,728.44 కోట్లుగా కేటాయించారు. 

2022-2023 బ‌డ్జెట్ కేటాయింపులు నిశితంగా గ‌మ‌నిస్తే హైద‌రాబాద్ న‌గ‌రంపై ఎక్కువ‌గా ఫోకస్ చేసిన‌ట్టు అర్థం అవుతోంది. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని గ్లోబ‌ల్ సిటీ గా ఎక్స్పోజ్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. వివిధ రంగాల్లో హైద‌రాబాద్ సాధించిన ప్ర‌గ‌తిని వివ‌రించారు. హైద‌రాబాద్ ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామ‌ని తెలంగాణ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్ తెలిపింది. 

కోవిడ్ ప్రభావంతో ప్రపంచం ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా కుదేలయినా, తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 12.98 శాతం పెరుగుదల నమోదైంది. 2021లో తెలంగాణ ఐటీ రంగం ఎగుమతులు మొత్తం విలువ లక్షా 45 వేల 522 కోట్లుగా ఉంది. ఈ విష‌యాన్ని బ‌డ్జెట్ లో ప్ర‌ధానంగా చేర్చారు. దీంతో పాటు శాంతి భ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు పెద్దపీట వేశారు. రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్ లో చేపట్టిన కమాండింగ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఈ సెంట‌ర్ ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8.8 ల‌క్ష‌ల సీసీ కెమెరాల‌ను ఒకే చోటు నుంచి ప‌ర్య‌వేక్షించ‌వ‌చ్చు. సైబ‌ర్ నేరాల‌ను అరిక‌ట్టేందుకు కూడా పటిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

హైద‌రాబాద్ ప‌రిధిలో ప‌చ్చ‌ద‌నం పెరుగుద‌లకు ప్ర‌భుత్వం చ‌ర్యలు తీసుకుంటోంది. అర్బ‌న్ పార్కుల‌ను అభివృద్ధి చేస్తోంది. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కింద చెట్ల‌ను పెంచే కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున చేప‌ట్టింది. తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 7.7 శాతం ప‌చ్చ‌దనం పెరిగింద‌ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ హ‌రిత‌హారం కోసం 8,511 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. దీంతో రాష్ట్రంలో, హైద‌రాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో గ్రీన‌రీ పెరుగుతోంది. ఈ విష‌యాన్ని కూడా బ‌డ్జెట్ ప్ర‌ధానంగా పేర్కొంది. 

హైద‌రాబాద్ ప‌రిధిలో మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం కోసం రోడ్ల‌ అభివృద్ధికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. న‌గ‌రం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డుకు అధనంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని భావిస్తోంది. ఇది ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలో మీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. దీంతో పాటు విదేశీయుల‌ను, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించేందుకు ప‌ర్యాట‌క‌రంగంపై తెలంగాణ టూరిజం పేరుతో స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే 479 పర్యాటక స్థలాలను గుర్తించింది. దీంతో పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, బుద్ధ జయంతి, ప్రపంచ పర్యాటక దినోత్సవం వంటి కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. 

దీంతో పాటు తెలంగాణ ప్ర‌భుత్వం 2015లో తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం వ‌ల్ల హైద‌రాబాద్ లో, రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెరిగేలా చేసింది. పరిశ్రమల అనుమతులు సులభతరం చేసింది. ఈ విష‌యాన్ని కూడా బ‌డ్జెట్ లో ప్ర‌భుత్వం హైలెట్ చేసింది. ఐటీ అభివృద్ధికి తీసుకున్న చ‌ర్య‌ల ఫ‌లితంగా ప్ర‌త్య‌క్ష్యంగా, ప‌రోక్ష్యంగా ఆ రంగంలో 6.29 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బ‌డ్జెట్ పేర్కొంది. 

మొత్తంగా హైద‌రాబాద్ ను గ్లోబ‌ల్ సిటీ గా, తెలంగాణను దేశానికి దిక్సూచిలా ఉంద‌ని ప్ర‌భుత్వం ప్రొజెక్ట్ చేసింది. గ‌త కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. దేశ స్థాయిలో రాజ‌కీయ చ‌క్రం తిప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కాకుండా మ‌రో ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలోని ప‌లువురు ముఖ్య రాజ‌కీయ నాయ‌కుల‌ను క‌లుస్తున్నారు. వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రం అయిన కర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులో శాంతి భ‌ద్ర‌త‌లు స‌రిగా లేవ‌ని టీఆర్ఎస్ నాయ‌కులు ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. దీనికి హిజాబ్ వివాదాన్ని ఆస‌రాగా చేసుకుంటున్నారు. బెంగళూరు ఐటీకి చాలా ప్ర‌సిద్ధి చెందిన న‌గ‌రం. అందుకే దీనిని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అయితే ఆ న‌గ‌రంతో పోలిస్తే శాంతి భ‌ద్ర‌త‌లు హైద‌రాబాద్ లో మెరుగ్గా ఉన్నాయ‌ని, ఇక్క‌డ ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు లేవ‌ని నేటి బ‌డ్జెట్ ఫోకస్ చేసింది. దీంతో పాటు నేటి బ‌డ్జెట్ కూడా తెలంగాణను ఒక బ్రాండ్ లాగా చూపించింది. దీని వెన‌క సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉంద‌ని తెలిపింది. దీంతో దేశం దృష్టి సీఎం కేసీఆర్ పై ప‌డే అవ‌కాశం ఉంది. అంటే కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు త‌న మార్గం సుగ‌మం చేసుకుంటున్నార‌ని అర్థం అవుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి సీఎం వ్యూహం ఫలిస్తుందా లేదా అన్న‌ది తెలియాలంటే మ‌రి కొంత కాలం పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.