కరీంనగర్: కృష్ణా జలాలను తరలించుకుని వెళ్లడానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. 

కేసీఆర్ నిర్వాకం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు సంబంధించి 203 జీవోను జారీ చేసిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు. జగన్, కేసీఆర్ అన్నదమ్ముళ్ల లాగా దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5వ తేదీన జారీ చేస్తే 11వ తేదీకి గానీ కేసీఆర్ స్పందించలేదని ఆయన అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆయన అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీల నీటిని తరలించుకుని పోతుందని ఆయన అన్నారు. కేసీఆర్ తీరు వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. 

టెలీ మెట్రీ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం చెప్పిందని, అది విభజన చట్టంలోనూ ఉందని, ఆ విషయంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆయన అన్నారు.  ప్రాంతీయ విద్వేషాలను రగిలించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాను షెకావత్ కు లేఖ రాశానని, దాంతో వెంటనే కృష్ణా బోర్డు సమావేశానికి షెకావత్ ఆదేశించారని ఆయన చెప్పారు. నిబంధనలను పాటించారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని షెకావత్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు.