Asianet News TeluguAsianet News Telugu

కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం బిజెపికి లేదు..: కిషన్ రెడ్డి సంచలనం

కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు... మరి సోనియా, రాహుల్ ను కూడా అరెస్ట్ చేయలేదు కాబట్టి బిజెపి, కాంగ్రెస్ ఒక్కటేనా అని కిషన్ రెడ్డి నిలదీసారు. 

Telangana BJP Chief Kishan Reddy Sensational comments on BRS MLC Kavitha AKP
Author
First Published Nov 5, 2023, 2:45 PM IST

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ అరెస్ట్ చేయకపోవడం తెలంగాణ బిజెపిని ఇరుకునపెట్టిందనే చెప్పాలి. కవితను రేపో మాపో అరెస్ట్ చేస్తారు అనేలా సిబిఐ, ఈడి విచారణ సాగింది. కానీ చివరకు ఆమెను అరెస్ట్ చేయకపోవడంతో బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని... అందువల్లే కవిత అరెస్ట్ ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ ఎన్నికల వేళ ప్రజల్లోకి తీసుకెళుతున్నారు కాంగ్రెస్ నాయకులు. దీంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ ఆరోపణలు స్పందించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను అనుకూలంగా వ్యవహరిస్తాని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... తాను ఎవరికీ లొంగేరకం కాదని కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనో...  కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీనో అరెస్ట్ చేయాల్సిన అవసరం బిజెపికి లేదన్నారు. అది  విచారణ సంస్థల బాధ్యత అని అన్నారు. తప్పు చేసినట్లు విచారణసంస్థలు నమ్మితే... ఆధారాలు లభిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు... అలాంటి అరెస్ట్ లను బిజెపి ఎప్పుడూ అడ్డుకోదని అన్నారు. నేరం చేసినవారు ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేసారు. మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ కూడా అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు... దర్యాప్తు సంస్థల విచారణకు హాజరయ్యారు... వారిని కూడా అరెస్ట్ చేయలేదు... అంటే బిజెపి, కాంగ్రెస్ ఒక్కటేనా? రెండు పార్టీలకు సంబంధం ఉన్నట్లా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

Read More  మేడిగడ్డ ఖర్చును కేసీఆర్ నుండే వసూలు చేస్తాం: బండి సంజయ్

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారు... కాంగ్రెస్ పార్టీపై నమ్మకంలేదు...  కాబట్టి బిజెపి గెలిచి తీరుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థులే కాదు స్వయంగా కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల ఓడిపోతారని అన్నారు. కేవలం డబ్బులు వెదజల్లితే గెలుస్తానని కేసీఆర్ అనుకుంటున్నాడు... కానీ ప్రజా వ్యతిరేకతను మార్చలేనని ఈ ఎన్నికలతో సీఎం కేసీఆర్ అర్థమవుతుందని అన్నారు.

తాను ఢిల్లీకి పోవాలి.. తన కొడుకును తెలంగాణ సీఎంను చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణను సాధించింది తానే కాబట్టి ప్రజలంతా తనకు బానిసగా వుండాలి అన్నట్లుగా కేసీఆర్ తీరు వుందన్నారు. బిజెపి సహకారం లేకుంటే కేవలం ఇద్దరు ఎంపీలున్న బిఆర్ఎస్ తెలంగాణను సాధించేదా... 165 సీట్లతో బిజెపి సంపూర్ణ మద్దతు ఇచ్చిందికాబట్టే తెలంగాణ కల సాకారం అయ్యిందని కిషన్ రెడ్డి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios