Asianet News TeluguAsianet News Telugu

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవి, హైదరాబాద్‌లో ఇంకో ఎయిర్‌పోర్ట్ ఏది .. పాత హామీల సంగతేంటీ : కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై స్పందించారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి . ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని మండిపడ్డారు. 

telangana bjp chief kishan reddy reacts on brs manifesto for assembly elections ksp
Author
First Published Oct 15, 2023, 6:18 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై స్పందించారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సంపదను పెంచలేదు అవినీతిని పెంచారని దుయ్యబట్టారు. బెస్ట్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తున్నారని.. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, కొత్త హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ సకల జనుల ద్రోహి అని.. తెలంగాణ ప్రజల చెవుల్లో కేసీఆర్ గులాబీ పూలు పెడుతున్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. 

కాంగ్రెస్ గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తోందని.. కేసీఆర్ నాలుగు సూపర్ స్పెషాలిటీలు అన్నారని ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ చర్చకు వస్తారా అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఏమయ్యాయి, జర్నలిస్టుల ప్రత్యేక నిధి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. వరంగల్ లో టెక్స్‌టైల్స్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి కనీసం భూమిని కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌లో మూసీలో కలవకుండా సమాంతర డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారని, మూసీకి పునరుజ్జీవనం చేస్తామన్నారని కిషన్ రెడ్డి చురకలంటించారు. హైదరాబాద్ ఉత్తరాన మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చేస్తామన్నారు ఏమైంది అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆయన ఫైర్ అయ్యారు. కార్పోరేషన్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారని, ఎఫ్ఆర్‌బీఎంకు చిక్కకుండా ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆయన ఫైర్ అయ్యారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios