తెలంగాణ పోలీసులపై బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజయ్‌ ప్రశంసలు కురిపించారు. గురువారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వారు నిజంగా హీరోలే అని, 15 నిమిషాల పాటు పాతబస్తీని వారికి అప్పగిస్తే అంతా జల్లెడ పడతారని చెప్పారు.

పాతబస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీలను పోలీసులు బయటకు తీస్తారని సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వారికి 15 నిమిషాల పాటు సమయం ఇచ్చి పాతబస్తీని అప్పగించాలని సవాల్ విసిరారు.

ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్‌ చాలామంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంజయ్ అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని బండి ఎద్దేవా చేశారు. 

హడావిడిగా ఎన్నికలు నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ నేతలు ఫోన్‌లు చేసి రూ.5 కోట్లు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

ఖమ్మం, వరంగల్‌లోనూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు. కొత్తగూడెం జిల్లా లక్ష్మీ దేవి మండలంలో ఐదుగురు మైనర్ బాలికలపై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయం బయటకు రాకుండా టిఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని .. ఇప్పటికయినా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.