బీఆర్ఎస్ పార్టీకి ఇక మిగిలింది వీఆర్ఎస్సేనని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ ఏడాదిలో 18 లక్షల ఉద్యోగాలిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని .. తెలంగాణలో నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీని పక్కనబెట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మహారాష్ట్రకు వెళితే కేసీఆర్‌ను ఎవరు అంటున్నారని ఆయన సెటైర్లు వేశారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్.. ఇక మిగిలింది వీఆర్ఎస్సేనని సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దోచుకునే పార్టీ అని.. కుటుంబ పాలన అని దుయ్యబట్టారు. ఈ ఏడాదిలో 18 లక్షల ఉద్యోగాలిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో 22 నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీని పక్కనబెట్టారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం బండి సంజయ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారంతా బీఆర్ఎస్ లో చేరారన్నారు. ఈ దఫా కూడా అదే పరిస్థితి ఉంటుందని బండి సజంయ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని బండి సంజయ్ ఆరోపించారు. తమకు ఒక్క సీటు రాకపోతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీకి భయపడే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. 

ALso REad: బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీమ్: తెలంగాణలో మాదే అధికారమన్న బండి సంజయ్

బీజేపీకి భయపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై ఒక్క మాట మాట్లాడని విషయాన్ని కూడా బండి సంజయ్ గుర్తు చేశారు. అసెంబ్లీలో మోడీని ఈ రెండు పార్టీలు తిట్టడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్ పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ కు మతి తప్పిందన్నారు. ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడనే భ్రమలో కేసీఆర్ ఉన్నాడన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ అని సంజయ్ ఆరోపించారు.