బీజేపీ  పని అయిపోయిందన్న వారికి ఈ ఫలితాలు చెంప పెట్టు అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ పర్యటనలు విహార యాత్రలేనని బండి సంజయ్ పేర్కొన్నారు. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై (five state election result) బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అధికారం సొంతం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ముందుగా ఊహించినదేనని సంజయ్ అన్నారు. కొన్ని సర్వే సంస్థలు, మీడియా ప్రతినిధులు యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ పనైపోతుందని ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కావాలని అక్కడి ప్రజలు ఆశించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ బద్నాం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తున్న పర్యటనలు కేవలం విహార యాత్రలుగా మిగిలిపోయాయని.. సీఎం పర్యటనలతో ఒరిగేదేమీ ఉండదని బండి సంజయ్ చురకలు వేశారు. 

కేసీఆర్ (kcr) చెల్లని రూపాయి అన్న ఆయన రేపు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమన్నారు. అవినీతి రహిత పాలనతో పాటు గూండా రాజ్యాలను కూకటివేళ్ళతో పెకిలించాం కాబట్టే… యూపీలో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ghmc ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవడమే కాదు… ఓటింగ్ శాతం కూడా పెరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇంజన్ లేని బండి నడవదని.. తెలంగాణలో ఇంజిన్ దారూసలేంలో ఉందని పరోక్షంగా ఎంఐఎంపై విమర్శలు చేశారు. నోటిఫికేషన్లపై కోర్టులకు వెళ్ళమని.. ఎవ్వరు వెళ్లినా కఠినంగా వ్యవహరించాలన్నారు. అసెంబ్లీ లో కేటీఆర్ చేసిన కామెంట్స్ పట్టించుకోమన్నారు. అభ్యర్థులు పరీక్షలు రాసి… ఉద్యోగ నియామక పత్రాలు అందుకునేవరకు ఎన్నికలకు వెళ్ళను అని కేసీఆర్ హామీ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కాగా.. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ మరోసారి విజయ ఢంకా మోగించింది. ఈ రోజు ఉదయం (UP Election results 2022) నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భారీ లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 250కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగి సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు. దీంతో 37ఏళ్ల తర్వాత బీజేపీ ఓ అరుదైన ఫీట్‌ను అందుకోనుంది. 

1985 తర్వాత యూపీలో ఏ సీఎం మళ్లీ ఎన్నిక కాలేదు. 1985 తర్వాత వరుసగా రెండోసారి ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నమాట. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ 269 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా నారయణ్ దత్ తివారీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 309 సీట్లు గెలుచుకుని సీఎం పీఠం దక్కించుకుంది. ఇప్పుడు ఇలా వరుసగా రెండుసార్లు(2017, 2022) సీఎం కావడం యోగికే దక్కింది.

కాగా.. యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగింద‌ని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం త‌మ‌దైన త‌ర‌హాలో ప్ర‌చారం సాగిస్తూ.. ఎన్నిక‌ల బ‌రిలో ముందుకుసాగాయి. మొద‌టి విడుతలో 58 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌గా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ న‌మోదైంది. 2017 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ( 63.5 శాతం) త‌క్కువ‌గా ఉంది.