జగిత్యాల ఎస్సై అనిల్ సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఐ అనిల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. కేసులను ఉపసంహరించుకోవాలని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంజయ్ డిమాండ్ చేశారు.
జగిత్యాల ఎస్సై అనిల్ సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ లేకుండా ఎంఐఎం ఒత్తిళ్లకు తలొగ్గి అనిల్‌ను సస్పెండ్ చేశారని సంజయ్ ఆరోపించారు. పాతబస్తీలో పోలీసులపై దాడి చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్‌లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు సంజయ్ కుమార్ ప్రకటించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్ తోపాటు ‘‘కేరళ స్టోరీ’’ సినిమా యూనిట్ హిందూ ఏక్తా యాత్రకు రాబోతోందని ఆయన చెప్పారు.
తెలంగాణలో హిందువులపై దాడులు చేస్తూ హిందువులను హేళన చేస్తున్న కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర నిర్వహించబోతున్నామని సంజయ్ పేర్కొన్నారు. హిందువులంతా స్వచ్ఛందంగా హాజరై సంఘటిత శక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సు గొడవ ఘటనలో జగిత్యాల ఎస్ఐని సస్పెండ్ చేయడంతోపాటు ఆయన భార్యపైనా కేసులు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎస్సై అనిల్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇది ముమ్మాటికీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యగానే అభివర్ణించారు.
ALso Read: తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. బండి సంజయ్
కర్ణాటకలో భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. తెలంగాణలో పోటీ పడి కొన్ని పార్టీలు హిందువులను హేళన చేస్తున్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి భార్య ఇద్దరు పసిపిల్లలతో ఎండా కాలం బస్సులో ప్రయాణిస్తోందంటేనే సదరు ఎస్ఐ ఎంతటి నిజాయితీపరుడో అర్ధం చేసుకోవాలన్నారు. సిగ్గులేకుండా ఆయనను సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్ఐ, ఆయన భార్యపైన, కానిస్టేబుల్ పైనా కేసు పెట్టడం సిగ్గు చేటని సంజయ్ దుయ్యబట్టారు.
బురఖా వేసుకున్న మహిళ ఫిర్యాదు చేస్తే అదో పెద్ద నేరంగా చూసి సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి లోపలేయకుండా.. తిరిగి ఎస్ఐపైనే కేసులు పెట్టడం దుర్మార్గమని సంజయ్ మండిపడ్డారు. పోలీస్ సంఘం ఏం చేస్తోంది.. మీ సంఘ సభ్యుడికి ఇంత అన్యాయం జరుగుతుంటే నోరెందుకు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.
తన ముందే భార్యను క్షోభకు గురిచేస్తుంటే ఆ ఎస్ఐ మానసిక వేదనను అర్ధం చేసుకోరా అని ఆయన నిలదీశారు. తక్షణమే ఎస్ఐ అనిల్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని.. కేసులను ఉపసంహరించుకోవాలని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సంజయ్ డిమాండ్ చేశారు. జగిత్యాల సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని.. పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ వాగుతున్నారని ఆయన విమర్శించారు. పోలీస్ స్టేషన్ పై దాడులు చేస్తున్నారని.. ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని వాళ్ల సంగతి చూస్తామని సంజయ్ హెచ్చరించారు.
