తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. పేపర్ లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. పేపర్ లీక్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. పేపర్ లీక్‌తో నష్టపోయిన అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. తమ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల ఖాళీల వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రిక్రూట్‌మెంట్ చేపడతామని చెప్పారు.
Also Read: విజయవాడలో శ్రీలక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్..
రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవటం లేదని మండిపడ్డారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. చివరకు హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మార్చ్‌నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మే 14న కరీంనగర్‌లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహించిన సంగతి తెలిసిందే.
