తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన..  సరైన సమయంలో స్పందించి ఉంటే జూడాలు, రెసిడెంట్‌ వైద్యులు సమ్మెకు దిగేవారు కాదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డాక్టర్లను పిలిచి చర్చలు జరిపే ధైర్యం లేదా అని సంజయ్ ప్రశ్నించారు.

వైద్య సిబ్బందిపై ఒత్తిడి పడుతుంటే ఖాళీలను ఎందుకు భర్తీ చేయడంలేదని ఆయన నిలదీశారు. సమ్మెకు సీఎం బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కరోనాతో చనిపోయిన ఎంత మంది సిబ్బందికి ఎక్స్‌గ్రేషియో చెల్లించారో సమాధానం చెప్పాలని ఆయన కోరారు. అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా వైద్యులు విధులు నిర్వర్తిస్తే వారిపక్షాన బీజేపీ పోరాడుతుందని సంజయ్‌ జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. 

Also Read:కరోనా వేళ జూనియర్ డాక్టర్ల సమ్మె: తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్

కేసీఆర్ ఆస్పత్రుల పర్యటన సందర్భంగా ఏ సమస్యలు గుర్తించారో చెప్ప‌లేద‌ని ఆయన విమ‌ర్శించారు.. జిల్లాలకు ఎన్ని నిధులు కేటాయించింది చెప్ప‌లేదన్నారు. రూ.2,500 కోట్లు ఏమ‌య్యాయ‌ని బండి సంజ‌య్ ప్రశ్నించారు.  సీఎం వస్తున్నాడు అంటే సినిమా సెట్టింగ్ లెక్క ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశార‌ని.. కేసీఆర్ వెళ్లి న‌టిస్తున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణలో కేసులు తగ్గాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుడు లెక్కలు చెపుతున్నారు అంటూ బండి సంజయ్ ఆరోపించారు.